Anjali Tendulkar : కొత్త ప్లాట్ కొన్న సచిన్ టెండూల్కర్ భార్య.. ధర తెలిస్తే మరీ ఇంత చీపా అంటారు
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుటుంబం ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. అయితే ఈసారి సచిన్ టెండూల్కర్ భార్య, డాక్టర్ అంజలి టెండూల్కర్ కొత్తగా కొనుగోలు చేసిన ఒక ప్రాపర్టీ గురించి ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. సాధారణంగా సెలబ్రిటీలు ఖరీదైన, హై-ప్రొఫైల్ ఏరియాలలో పెట్టుబడులు పెడతారు.

Anjali Tendulkar : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భార్య, డాక్టర్ అయిన అంజలి టెండూల్కర్ ముంబై సమీపంలోని విరార్‌లో ఒక కొత్త అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. Zapkey.com ప్రకారం.. ఈ అపార్ట్‌మెంట్ ధర రూ.32 లక్షలు అన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా, సెలబ్రిటీలు ఖరీదైన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడతారు. కానీ, ఈసారి అంజలి టెండూల్కర్ విరార్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది.
అపార్ట్‌మెంట్ వివరాలు ఇవే!
అధికారిక పత్రాల ప్రకారం, అంజలి టెండూల్కర్ పెనిన్సులా హైట్స్ అనే భవనంలో ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. 391 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ ఆ భవనం మూడో అంతస్తులో ఉంది. విరార్ అనేది ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో భాగం. ఇటీవల కాలంలో ఇక్కడ హౌసింగ్ ప్రాజెక్టులు , ప్రాపర్టీ పెట్టుబడులు వేగంగా పెరిగాయి.
ఈ లావాదేవీ మే 30, 2025న అధికారికంగా రిజిస్టర్ అయింది. రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఈ ఆస్తి కోసం అంజలి టెండూల్కర్ రూ. 1.92 లక్షలు స్టాంప్ డ్యూటీగా, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించారు. మహిళా కొనుగోలుదారు కావడం వల్ల ఆమెకు స్టాంప్ డ్యూటీపై 1% తగ్గింపు కూడా లభించింది. మహారాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆస్తులు కొనుగోలు చేయడానికి ప్రోత్సహించడానికి ఈ ప్రయోజనాన్ని కల్పిస్తుంది.
విరార్‌లో ఆస్తుల ధరలు
స్థానిక రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ప్రకారం.. విరార్‌లో నివాస ఆస్తుల ధరలు చదరపు అడుగుకు రూ. 6,000 నుంచి రూ. 9,000 వరకు ఉన్నాయి. ప్రాంతం, భవనంలో ఉన్న సౌకర్యాలు, రవాణా సౌకర్యాలను బట్టి ఈ ధరలు మరింత పెరగవచ్చు. విరార్ ముంబై నగరానికి ఉత్తర భాగంలో ఉంది. కొత్త మెట్రో కనెక్టివిటీ మరియు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది.
టెండూల్కర్ కుటుంబం పెట్టుబడులు
సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్కర్ ఇప్పటికే ముంబైలో విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నారు. ఇప్పుడు విరార్ వంటి ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం ద్వారా వారి ఆస్తి పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతం అవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




