Sachin Donates Blood: స్వచ్ఛందంగా రక్తదానం చేసిన సచిన్.. తన అభిమానులు బ్లడ్ డొనేట్ చేయాలని పిలుపు
Sachin Tendulkar: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జూన్ 14న ఓ శిబిరంలో స్వచ్ఛందంగా తన రక్తాన్ని దానం చేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని..
Sachin Tendulkar: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జూన్ 14న ఓ శిబిరంలో స్వచ్ఛందంగా తన రక్తాన్ని దానం చేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని సచిన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రక్తదానం అవశ్యకత గురించి తెలిపారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇతరుల ప్రాణాలు కాపాడే శక్తి మనందరికీ ఉందని, దాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలన్నారు. గతంలో తమ కుటుంబంలో జరిగిన ఓ సంఘటన తనకు రక్తదానం ప్రాధాన్యతను గుర్తు చేసిందని సచిన్ తెలిపారు. ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసి సంతోషం వ్యక్తం చేశారు.
‘కొన్నాళ్ల క్రితం మా కుటుంబంలోని ఓ వ్యక్తికి రక్తం అవసరమొచ్చింది. అతనికి పెద్ద సర్జరీ జరగ్గా ఎక్కువ మొత్తంలో రక్తం కోల్పోయాడు. అది మాకు ఓ చేదు అనుభవం. అతని కోసం మేం రక్తం సేకరించే ప్రయత్నాలు చేస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి మా దగ్గరకొచ్చి తన రక్తాన్ని ఇచ్చి మా కుటుంబసభ్యుడి ప్రాణాలు కాపాడాడు. దాంతో మాకు చాలా సంతోషమేసింది. ఆ వ్యక్తికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థంకాలేదు. ఇప్పుడతనికి ధన్యవాదాలు చెబుతున్నా. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మా బృందం అంతా రక్తాన్ని దానం చేసేందుకు వచ్చాం. మేం చేసిన ఈ పని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎవరినైనా కాపాడుతుందని బలంగా నమ్ముతున్నా. మీరు కూడా ఇలాగే రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నా. ఇది ప్రజలందరికీ ఉపయోగపడే ఓ మంచి కార్యం. అందుకోసం మీరు చేయాల్సిందల్లా దగ్గర్లోని బ్లడ్ బ్యాంక్‌లను సంప్రదించడమే. మీరు చేసే పనికి వాళ్లెంతో సంతోషిస్తారు. దాని వల్ల అవసరమైనవారిని కాపాడినవారౌతారు’ అని సచిన్ వీడియోలో పేర్కొన్నారు.
Also Read: కూలీల కంటపడిన అరుదైన పొడజాతి పాము.. భయపడి చంపేసిన స్థానికులు