IPL 2025: తాను ముంబైకి కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. ఇప్పుడు వచ్చిన మార్పులపై రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌లో తన కొత్త పాత్రను, కెప్టెన్సీ మారిన తర్వాత జరిగిన మార్పులను వివరించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కు ట్రోఫీ అందించడం తన లక్ష్యమని, యువ ఆటగాళ్ళతో కలిసి ఆడటానికి ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపాడు.

ముంబై ఇండియన్స్‌కు పెద్ద దిక్కలాంటి రోహిత్ శర్మ.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ బ్యాటింగ్ చేయలేదు. గతంలో కెప్టెన్‌గా ముంబైకి ఏకంగా ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్.. ప్రస్తుతం కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్ కంటే ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చిన హార్ధిక్ పాండ్యాకు ముంబై మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. రోహిత్‌ను తప్పించి.. పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంపై జరిగిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. కానీ, ఈ సీజన్‌కు వచ్చేసరికి పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చింది.. ముంబై ఫ్యాన్స్ పాండ్యాను కెప్టెన్‌గా యాక్సెప్ట్ చేశారు. అయితే.. తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలాంటి మార్పులు జరిగాయో తాజాగా రోహిత్ శర్మ వివరించాడు.
హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. టీమ్‌లోకి నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు స్పష్టంగా మారిపోయాయి. గతంలో నేను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేవాడిని, ఇప్పుడు ఓపెనర్‌గా ఆడుతున్నాను. గతంలో నేను కెప్టెన్‌ని, ఇప్పుడు కాదు. నాతో కలిసి ఆడిన వారు కొందరు ఇప్పుడు కోచ్‌లుగా మారారు. ఎన్ని మారిన మైండ్‌సెట్ అలానే ఉంది. ఈ టీమ్ కోసం నేను చేయాలనుకుంటున్నది మారలేదు. మ్యాచ్‌లు గెలవడం, ముంబైకి ట్రోఫీ అందించడం ఇదే నాకు ముఖ్యం. ఎంఐలో ట్రెంట్ బౌల్ట్ లాంటి ఎక్స్‌పీరియన్డ్స్ ప్లేయర్లు ఉన్నారు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఉన్నాడు, ఎక్స్‌పీరియన్స్, క్లాస్ రెండు అతని వద్ద ఉన్నాయి. విల్ జాక్స్, రీస్ టోప్లీ వంటి ఆటగాళ్ళులో టీమ్ వైవిధ్యం కనిపిస్తోంది.
ర్యాన్ రికెల్టన్ లాంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ ఉన్నాడు. ఇలా టీమ్‌లోని ప్రతి ఆటగాడు ఏదో ఒక విధంగా జట్టుకు ఉపయోగపడుతున్నారు. పైగా టీమ్‌లో చాలామంది యంగ్ ఇండియన్ టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. వారితో కలిసి మరింత క్రికెట్ ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం నా టార్గెట్ ఒక్కటే టాటా ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకోవడం, ముంబై ఇండియన్స్‌కు కీర్తిని తిరిగి తీసుకురావడం అంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తొలి మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే గెలిచింది. ఇలాంటి స్టార్ట్ ముంబైకి కొత్తేమి కాదు. పలు సీజన్స్‌లో వరుస ఓటములు ఎదురైన తర్వాత కూడా ముంబై ఇండియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.