రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత జట్టు స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు. గతేడాది డిసెంబర్ 30న పంత్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతని మోకాలికి సర్జరీ జరిగింది. కాగా గాయాల కారణంగా చాలా కాలం నుంచి క్రికెట్‌కు దూరంగానే ఉంటున్నాడు పంత్. అతను మైదానంలోకి అడుగపెట్టడానికి చాలా సమయం పడుతుందని తెలుస్తుంది. ఈ విషయాలను పక్కన పెడితే ప్రస్తుతం కోలుకోవడంపైనే దృష్టి సారించాడు పంత్. కొన్ని రోజుల క్రితం, అతను ఊతకర్రల సహాయంతో నడుస్తున్న కొన్ని చిత్రాలను పోస్ట్ చేసిన పంత్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో వీడియోను షేర్ చేశాడు. దీనిని చూస్తుంటే పంత్ గాయాల నుంచి చాలా వరకు కోలుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో నడుస్తున్న వీడియోనూ షేర్ చేశాడు పంత్. పూల్‌లోనే చేతి కర్ర సాయంతో అటూ ఇటూ నడిచాడు. అనంతరం ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంటూ.. ‘చిన్న విషయాలు, పెద్ద విషయాలు, మధ్యలో జరుగుతున్న అన్నింటికీ నేను రుణపడి ఉన్నాను. వీటన్నింటిని ఒకే స్టెప్‌లో తీసుకుంటున్నా’ అని తనను తాను మోటివేట్ చేసుకున్నాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా రోజుల తర్వాత పంత్ నడుస్తున్నాడంటూ క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా పంత్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని, మైదానంలో అడుగుపెట్టడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందని భావిస్తున్నారు. దీంతో రాబోయే ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరం కానున్నాడు పంత్. అలాగే ఈ ఏడాది చివర్లో జరగబోయే వన్డే వరల్డ్ కప్‌లో ఆడడం కూడా కష్టమే. ఇదిలా ఉంటే ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పంత్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన కేఎస్ భరత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో పంత్ రీఎంట్రీపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..