Rishabh Pant: పంత్‌ ఆరోగ్యంపై లేటెస్ట్‌ అప్‌డేట్‌.. ఇన్‌ఫెక్షన్‌ భయంతో ప్రత్యేక గదికి టీమిండియా క్రికెటర్‌

పంత్ ఆరోగ్యానికి సంబంధించి లేటెస్ట్‌ అప్‌డేట్ వచ్చింది. పంత్ పరిస్థితి మెరుగుపడుతోందని, అతడిని ఐసీయూ నుంచి ప్రైవేట్ వార్డుకు తరలించినట్లు డీడీసీఏ డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ పేర్కొన్నారు.

Rishabh Pant: పంత్‌ ఆరోగ్యంపై లేటెస్ట్‌ అప్‌డేట్‌.. ఇన్‌ఫెక్షన్‌ భయంతో ప్రత్యేక గదికి టీమిండియా క్రికెటర్‌
Rishabh Pant

Updated on: Jan 03, 2023 | 7:26 AM

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా క్రికెటర్‌ రిషబ్ పంత్ ఆరోగ్యం మెరుగవుతోంది. డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఈ నేపథ్యంలో పంత్ ఆరోగ్యానికి సంబంధించి లేటెస్ట్‌ అప్‌డేట్ వచ్చింది. పంత్ పరిస్థితి మెరుగుపడుతోందని, అతడిని ఐసీయూ నుంచి ప్రైవేట్ వార్డుకు తరలించినట్లు డీడీసీఏ డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ పేర్కొన్నారు. ‘ఐసీయూలో చికిత్స పొందుతున్న పంత్‌కు ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందన్న భయంతో అతన్ని ప్రత్యేక గదికి మార్చాల్సిందిగా.. అతని కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బందికి చెప్పాం. ప్రస్తుతం పంత్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. త్వరలోనే కోలుకుంటాడు’ అని శర్మ వెల్లడించారు. అయితే అతని కాలికి శస్త్రచికిత్స కొనసాగుతుందని, ప్రస్తుతం ఎంఆర్‌ఐకి సంబంధించి ఎలాంటి ప్లాన్‌ లేదన్నారు.  రిషబ్ పంత్ గత శుక్రవారం కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఢిల్లీ నుంచి రూర్కీలోని తన ఇంటికి వెళ్తుండగా అతని కారు ప్రమాదానికి గురైంది. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో  పంత్‌ కాలు, తలకు తీవ్ర గాయాలయ్యాయి.

కాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) డైరెక్టర్ శ్యామ్ శర్మ, బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ ఆసుపత్రిలో పంత్, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా పంత్‌కు లిగమెంట్ ఫ్రాక్చర్‌ అయ్యింది. ఈ గాయం నుండి కోలుకోవడానికి అతనికి మూడు నుండి ఆరు నెలల సమయం పట్టవచ్చు. దీంతో ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పంత్ ఆడడం కష్టమని తెలుస్తోంది. పంత్ ఇప్పటివరకు 33 టెస్టుల్లో ఐదు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో సహా 2,271 పరుగులు చేశాడు. 30 వన్డేలు, 66 టీ20ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇక రిషబ్‌ ఐపీఎల్‌లో ఆడే సూచనలు కనిపించడం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న అతను ఆడకపోతే ఢిల్లీకి కష్టాలు తప్పవు. ఫ్రాంచైజీ అతని స్థానంలో కెప్టెన్, వికెట్ కీపర్‌ను వెతుక్కోవాలి. పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ జట్టుకు సారథ్యం వహించవచ్చు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..