Rishabh Pant: పంత్‌ను గుర్తుపట్టలేదు.. అతని స్థానంలో ఎవరున్నా అలాగే సహాయం చేస్తా: బస్ డ్రైవర్ సుశీల్ కుమార్
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బస్ డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరంజీత్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానిస్తామంటూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
గత శుక్రవారం జరిగిన కారు ప్రమాదంలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన బస్ డ్రైవర్ సుశీల్ కుమార్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే అతనితో పాటు కండక్టర్ పరంజీత్‌లను హర్యానా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఘనంగా సత్కరించి నజరానా అందజేసింది. ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా వీరిని ఘనంగా సన్మానించనుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సుశీల్ కుమార్, పరంజీత్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానిస్తామంటూ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. న్యూ ఇయర్‌ని తన తల్లి, కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడానికి అర్ధరాత్రి 2 గంటలకు ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్‌కు బయలుదేరిన పంత్ ఘోరమైన కారు ప్రమాదానికి గురయ్యాడు. కారు బలంగా డివైడర్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. అయితే తక్షణమే స్పందించిన పంత్ కారు అద్దాలను పగలగొట్టి బయటపడ్డాడు. ఇదే సమయంలో అటువైపు వచ్చిన బస్ డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరంజీత్ రోడ్డుపై పడి ఉన్న పంత్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంలో సహాయపడ్డారు.
మొదట అమ్మకే ఫోన్ చేయమన్నాడు..
కాగా సుశీల్ మొదట సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు పంత్‌ను గుర్తుపట్టలేదట. అంతేకాదు అంతటి ఘోర ప్రమాదానికి గురైన వ్యక్తి బతకడం కష్టమని భావించాడట. ‘ఆరోజు తెల్లవారుజాము 4.25 గంటలకు మా బస్సు బయలుదేరింది. 5.15 గంటలకు గురుకుల్ నర్సన్‌కు చేరుకున్నాం. పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించలేదు. అదే సమయంలో ఢిల్లీ వైపు నుంచి అతి వేగంతో ఒక కారు వస్తూ కనిపించింది. ఆ కారును చూడగానే డ్రైవర్ అదుపు తప్పిపోయినట్లు అనిపించింది. క్షణాల్లో కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఆ కారు మా బస్సును మా బస్సును ఢీకొంటుందేమోనని ఒక్క నిమిషం భయపడ్డాను. ముందు జాగ్రత్తగా స్లో చేసి రైట్ టర్న్ తీసుకున్నాం. ఇక కారులో మంటలు చెలరేగగానే నేను, కండక్టర్ మరికొందరు ప్రయాణికులు కలిసి కారు దగ్గరకు పరిగెత్తాం. రోడ్డుపై పడిఉన్న పంత్‌ను లాగి పక్కన కూర్చోబెట్టాం. వెంటనే పోలీసులకు సమాచారం అందించాం. కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన పంత్ మొదట తన తల్లికి ఫోన్ చేయమన్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే పోలీసులు, అంబులెన్స్ అక్కడికి చేరుకుని అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లాయి . నేను గత తొమ్మిదేళ్లుగా బస్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నా. జాతీయ రహదారిపై పలు ప్రమాదాలను చూస్తున్నాను. అక్కడ పంత్ ఉన్నాడా? లేక ఇంకెవరైనా ఉన్నారా? అని చూడను. మనిషిని రక్షించడమే నా ప్రథమ కర్తవ్యం అని ‘ డ్రైవర్ తెలిపాడు.
The driver and conductor of Haryana Roadways saved the life of cricketer #RishabhPant. We have decided to honor them on January 26: Uttarakhand CM Pushkar Singh Dhami in Dehradun pic.twitter.com/v2Qzz0TEdU
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 1, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..