
Most searched Indian sportsperson: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా శోధించిన ఆటగాళ్లలో టీమిండియా నుంచి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అయితే, తాజా, మాజీల నుంచి ఎందరో ఈ లిస్టులో ఉన్నారు. అయితే, ఈ లిస్టులో ఓ భారత మాజీ ప్లేయర్ అగ్రస్థానంలో నిలవడం మాత్రం చాలా ఆశ్చర్యకరంగా మారింది. ఇక, భారత క్రికెటర్ల గురించి మాట్లాడితే, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ కోట్లలో అభిమానులను కలిగి ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. ఇంటర్నెట్‌లో ఈ ఆటగాళ్ల గురించి నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈసారి గూగుల్‌లో సెర్చ్ చేసిన ప్లేయర్‌ల లిస్ట్‌లో షాకింగ్ రిజల్డ్ వచ్చింది. భారత్‌లో అత్యధికంగా శోధించిన ఆటగాడు ధోనీ లేదా కోహ్లీ అని ఆలోచిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ ప్లేయర్‌గా ప్రవీణ్ తాంబే నిలిచాడు. తాంబే తన చివరి మ్యాచ్‌ని చాలా కాలం క్రితం ఆడాడు. అతను ఎప్పుడూ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇలా ఉంటే అతను ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండటం నిజంగా ఆశ్చర్యకరంగా నిలిచింది. ఈ ఏడాది ప్రవీణ్ తాంబే బయోపిక్ విడుదలైంది. ఇందులో శ్రేయాస్ తల్పాడే అద్భుతంగా నటించాడు. బహుశా ఈ సినిమా కారణంగానే తాంబే గురించి చాలా అన్వేషణ జరిగిందని భావిస్తున్నారు.
41 సంవత్సరాల వయస్సు వరకు, తాంబే ఎలాంటి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడలేదు. కానీ, రాజస్థాన్ రాయల్స్ అతనికి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అవకాశం ఇవ్వడం ద్వారా అతని జీవితాన్ని మార్చింది. తాంబే రాజస్థాన్‌కు ఆడుతున్నప్పుడు అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ టీంలోనూ తన సత్తా చూపాడు. అయితే, టీ10 లీగ్‌లో ఆడిన కారణంగా, అతను భారత దేశవాళీ మ్యాచ్‌లలో ఆడకుండా నిషేధానికి గురయ్యాడు. ప్రస్తుతం కోల్‌కతా జట్టులో బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.
51 ఏళ్ల తాంబే తన కెరీర్‌లో మొత్తం 64 టీ20 మ్యాచ్‌లు ఆడి 70 వికెట్లు పడగొట్టాడు. తాంబే 15 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. అతని ఎకానమీ రేటు ఏడు కంటే తక్కువగా ఉంది. ఇంత చిన్న ఫార్మాట్‌లో కూడా తక్కువ పరుగులు ఇవ్వడం అతనికే సొంతమైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..