కాలర్ ఎగరేస్తున్న PCB.. ఛాంపియన్స్ ట్రోఫీతో లాభమేనట..! ఎన్ని కోట్లంటే..?
2025 ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. స్టేడియం అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, టీమిండియా రాకపోవడంతో హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ జరిగింది. పాకిస్థాన్ జట్టు తొలి దశలోనే నిష్క్రమించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నష్టపోయిందని వార్తలు వస్తున్నాయి, కానీ బోర్డు ఛైర్మన్ లాభం వచ్చిందని చెప్పారు. ఈ విరుద్ధ వాదనలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

టీమిండియా విజేతగా నిలిచిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్ ఓ మేజర్ ఐసీసీ ట్రోర్నీని హోస్ట్ చేసింది. ఈ మెగా టోర్నీ కోసం పాకిస్థాన్ తమ క్రికెట్ స్టేడియాలను భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి చేసింది. 1996 వన్డే వరల్డ్‌కప్ తర్వాత దాదాపు 29 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్ హోస్ట్ చేసేందుకు సిద్ధం అవ్వడంతో.. స్టేడియాలను ముస్తాబు చేసింది. కానీ, టీమిండియా, పాకిస్థాన్‌కు రాకవపోవడంతో టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. అంటే టీమిండియా ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో, మిగతా మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో నిర్వహించేలా ఐసీసీ నిర్ణయించింది.
దాంతో పాటు పాకిస్థాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో ఫేలవ ప్రదర్శన కనబర్చడం, గ్రూప్ దశలోనే ఇంటి బాటపట్టడం, టీమిండియా సెమీ ఫైనల్, ఫైనల్ ఆడటంతో ఎంతో కీలకమైన, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగడంతో పాకిస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు వార్తలు వచ్చాయి. కరాచీ, లాహోర్, రావల్పిండిలోని మూడు క్రికెట్ స్టేడియంల అభివృద్ధికి ఏకంగా రూ.557 కోట్లను ఖర్చు చేశారని, ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్స్ కోసం మరో రూ.346.7 కోట్లను ఖర్చు చేశారని తెలిసింది.
కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేసినందుకు ఐసీసీ నుంచి కేవలం రూ.52 కోట్లు మాత్రమే అందాయని దీంతో పాక్ తీవ్రంగా నష్టపోయిందని కూడా కథనాలు పేర్కొన్నాయి. పైగా స్పాన్నర్ల, బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ వల్ల కూడా పెద్దగా డబ్బు రాకపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర నష్టాన్ని చవిచూసినట్లు ప్రముఖ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కానీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీ మాత్రం అలాంటిదేం లేదని అన్నారు. తమకు ఛాంపియన్స్ ట్రోఫీ వల్ల నష్టం రాలేదు, 86.25 కోట్ల లాభం వచ్చిందంటూ వెల్లడించారు. మరి ఆ లాభం ఎలా వచ్చిందనే విషయం ఇంకా వెల్లడించలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..