T20 World Cup 2026 Super 8 : నేడే సూపర్-8 అసలైన మజా..పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ ఢీ..ఈ పోరులో గెలుపెవరిది?
T20 World Cup 2026 Super 8 : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలైన మజా మొదలైంది. గ్రూప్ దశ ముగియడంతో ఇప్పుడు అగ్రశ్రేణి జట్ల మధ్య సూపర్-8 పోరుకు తెరలేచింది. ఈ రౌండ్‌లో భాగంగా నేడు (ఫిబ్రవరి 21, శనివారం) కొలంబోలోని చారిత్రాత్మక ఆర్.ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.

T20 World Cup 2026 Super 8 : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలైన మజా మొదలైంది. గ్రూప్ దశ ముగియడంతో ఇప్పుడు అగ్రశ్రేణి జట్ల మధ్య సూపర్-8 పోరుకు తెరలేచింది. ఈ రౌండ్‌లో భాగంగా నేడు (ఫిబ్రవరి 21, శనివారం) కొలంబోలోని చారిత్రాత్మక ఆర్.ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ విజయం చాలా కీలకం. నువ్వా-నేనా అన్నట్లు సాగే ఈ సమరంలో పైచేయి ఎవరిదో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఆర్.ప్రేమదాస స్టేడియం పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు స్వర్గధామం. బంతి కాస్త నెమ్మదిగా వస్తుంది, దీనివల్ల బ్యాటర్లు భారీ షాట్లు ఆడటం కొంచెం కష్టమే. ఇక్కడ ఇప్పటివరకు జరిగిన 64 టీ20 మ్యాచ్‌లలో ఛేజింగ్ చేసిన జట్లే 36 సార్లు విజయం సాధించాయి. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 144 పరుగులు మాత్రమే. అయితే, పిచ్ కండిషన్స్ దృష్ట్యా టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి 170 పరుగులకు పైగా బోర్డుపై ఉంచితే, ప్రత్యర్థిని కట్టడి చేయడం సులభం అవుతుంది. పేసర్లు మొదట్లో ప్రభావం చూపినా, మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లే మ్యాచ్ గమనాన్ని మారుస్తారు.
హెడ్-టు-హెడ్
పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య రికార్డులను గమనిస్తే రెండు జట్లు సమానంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 49 టీ20 మ్యాచ్‌ల్లో తలపడగా, పాకిస్థాన్ 24 మ్యాచ్‌ల్లో, న్యూజిలాండ్ 23 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. కేవలం ఒక మ్యాచ్ తేడాతో పాక్ ముందంజలో ఉంది. ఈ గణాంకాలను చూస్తుంటే నేటి మ్యాచ్ ఎంత హోరాహోరీగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి?
భారతదేశంలో ఈ మెగా పోరును స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో చూడాలనుకుంటే జియోహాట్‌స్టార్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
ప్లేయింగ్ 11 (అంచనా):
పాకిస్థాన్: సాహిబ్‌జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ ఆగా (కెప్టెన్), బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ (కీపర్), ఖ్వాజా నఫే, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిక్.
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, ఇష్ సోధి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
