AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఆరెంజ్ క్యాప్ రేస్‌లో హోరాహోరీ.. గిల్‌కు షాకిచ్చిన సాయి సుదర్శన్

IPL 2026 : ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ రేస్‌లో శుభ్‌మన్ గిల్‌ను సాయి సుదర్శన్ వెనక్కి నెట్టాడు. పర్పుల్ క్యాప్ రేస్‌లో భువనేశ్వర్ కుమార్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 66వ లీగ్ మ్యాచ్ ఒకరిద్దరు ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులకు వేదికైంది.

IPL 2026 : ఆరెంజ్ క్యాప్ రేస్‌లో హోరాహోరీ.. గిల్‌కు షాకిచ్చిన సాయి సుదర్శన్
Sai Sudharsan (2)
Rakesh
|

Updated on: May 22, 2026 | 8:38 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు రావడంతో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేస్ అత్యంత ఆసక్తికరంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 66వ లీగ్ మ్యాచ్ ఒకరిద్దరు ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఏకపక్ష విజయాన్ని అందుకున్నప్పటికీ, అదే జట్టుకు చెందిన ఇద్దరు స్టార్ ఓపెనర్ల మధ్య ఆరెంజ్ క్యాప్ కోసం సాగిన పోరు అభిమానులకు అసలైన మజాను అందించింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆరెంజ్ క్యాప్ ఒకరి నుంచి మరొకరి చేతుల్లోకి మారిపోవడం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 37 బంతుల్లోనే 64 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఈ సీజన్‌లో అతని మొత్తం పరుగులు 616కు చేరాయి. దాంతో వైభవ్ సూర్యవంశీని వెనక్కి నెట్టి గిల్ ఆరెంజ్ క్యాప్ రేస్‌లో నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లాడు. అయితే గిల్ ఆనందం కొద్ది నిమిషాలు కూడా నిలవలేదు. క్రీజులో అప్పటికే పాతుకుపోయిన మరో ఓపెనర్ సాయి సుదర్శన్ చెన్నై బౌలర్లను ఊచకోత కోస్తూ 53 బంతుల్లో 84 పరుగులు సాధించాడు. దీనితో 14 మ్యాచ్‌ల్లో 638 పరుగులతో సుదర్శన్.. గిల్‌ను సైతం అధిగమించి ఆరెంజ్ క్యాప్‌ను తన సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేస్‌లో గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్ (638 రన్స్), శుభ్‌మన్ గిల్ (616 రన్స్) మొదటి రెండు స్థానాల్లో ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న వైభవ్ సూర్యవంశీ 13 మ్యాచ్‌ల్లో 579 పరుగులతో మూడో స్థానానికి పడిపోయాడు. అయితే వైభవ్‌కు ఇంకా ఒక లీగ్ మ్యాచ్ మిగిలి ఉండటంతో అతను మళ్లీ టాప్ ప్లేస్‌కు వచ్చే అవకాశం ఉంది. వీరి తర్వాత మిచెల్ మార్ష్ 13 మ్యాచ్‌ల్లో 563 పరుగులతో నాల్గో స్థానంలో, హెన్రిచ్ క్లాసెన్ 13 మ్యాచ్‌ల్లో 555 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

ఇక లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లకు ఇచ్చే పర్పుల్ క్యాప్ రేస్‌లో ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సుదీర్ఘ కాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భువీ 13 మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా, చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టిన పంజాబ్ కింగ్స్ పేసర్ కగిసో రబాడా కూడా 24 వికెట్లతో భువీ సరసన చేరాడు. అయితే ఎకానమీ రేట్ పరంగా భువనేశ్వర్ కుమార్ మెరుగ్గా ఉండటంతో పర్పుల్ క్యాప్ అతని వద్దే భద్రంగా ఉంది. వీరిద్దరి తర్వాత అన్షుల్ కాంబోజ్ 21 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పిన్ మాయాజాలంతో 3 వికెట్లు పడగొట్టిన గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పర్పుల్ క్యాప్ రేస్‌లో టాప్-5 లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం రషీద్ ఖాన్ ఖాతాలో 19 వికెట్లు చేరడంతో అతను నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. దీనితో ఇప్పటివరకు టాప్‌లో ఉన్న జోఫ్రా ఆర్చర్ (18 వికెట్లు), కార్తీక్ త్యాగి (18 వికెట్లు) ఐదో స్థానానికి పరిమితమయ్యారు. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు కూడా ముగిసేసరికి ఈ క్యాప్‌లు ఎవరు సొంతం చేసుకుంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us