AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jasprit Bumrah : నువ్వు అసలు ప్రొఫెషనల్ క్రికెటర్‌వేనా?.. లైవ్ లోనే బూమ్రాను ఏకిపారేసిన క్రికెట్ దిగ్గజం

Jasprit Bumrah : ఐపీఎల్ 2026లో బుమ్రా నో-బాల్స్ వేయడంపై సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. ప్రొఫెషనల్ క్రికెటర్ ఇలా చేయడం అస్సలు బాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో బూమ్రా ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు.

Jasprit Bumrah : నువ్వు అసలు ప్రొఫెషనల్ క్రికెటర్‌వేనా?.. లైవ్ లోనే బూమ్రాను ఏకిపారేసిన క్రికెట్ దిగ్గజం
Jasprit Bumrah
Rakesh
|

Updated on: May 05, 2026 | 12:39 PM

Share

Jasprit Bumrah : ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఒకప్పుడు తన బౌలింగ్‌తో బ్యాటర్లను వణికించిన బుమ్రా, ఈ సీజన్‌లో మాత్రం పదును పోయిన కత్తిలా కనిపిస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన తాజా మ్యాచ్‌లో బుమ్రా వేసిన నో బాల్స్ చూసి క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లైవ్ కామెంట్రీలోనే బుమ్రాపై తన కోపాన్ని వెళ్లగక్కారు. లక్నో ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో బుమ్రా వరుసగా రెండు నో-బాల్స్ వేయడం గవాస్కర్‌ను తీవ్ర అసహనానికి గురిచేసింది. “మళ్ళీ మళ్ళీ నాకు చెప్పకండి.. బుమ్రా నో-బాల్ వేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదు. నువ్వు ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌వి, ఇలాంటి తప్పులు చేయడం ఏంటి? వైడ్లు వేస్తే అర్థం చేసుకోవచ్చు కానీ, నో-బాల్స్ వేయడం క్షమించరాని నేరం” అంటూ గవాస్కర్ మైక్ ముందే విరుచుకుపడ్డారు.

లక్నో బ్యాటర్ హిమ్మత్ సింగ్ 14వ ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కానీ రీప్లేలో అది నో-బాల్ అని తేలడంతో హిమ్మత్ సింగ్ బతికిపోయాడు. ఆ తర్వాత రెచ్చిపోయిన హిమ్మత్, 40 పరుగులు చేసి లక్నో స్కోరును 220 దాటించాడు. ఈ తప్పిదం మ్యాచ్‌పై ఎంతటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా నో-బాల్స్ వేస్తున్నప్పుడు కెమెరాలు ముంబై కోచ్ మహేల జయవర్ధనే, బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ వైపు మళ్లగా, వారి ముఖాల్లో నిరాశ స్పష్టంగా కనిపించింది. బౌలింగ్ కోచ్ గారూ.. ఇది చాలా పెద్ద తప్పు అంటూ మలింగను ఉద్దేశించి గవాస్కర్ వ్యాఖ్యానించారు.

బుమ్రాకు ఈ 2026 ఐపీఎల్ సీజన్ ఒక పీడకలలా మారింది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన ఆయన కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 45 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. గత రెండు నెలల క్రితం వరకు అద్భుత ఫామ్‌లో ఉన్న బుమ్రా, ఈ సీజన్‌లో ఇన్ని నో-బాల్స్ (మొత్తం 8) వేయడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ముంబై ఇండియన్స్ సీజన్ ఎలా సాగుతుందో బుమ్రా బౌలింగ్ చూస్తే అర్థమైపోతోందని మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా కూడా ఎద్దేవా చేశారు.

టాస్ గెలిచిన ముంబై మొదట బౌలింగ్ ఎంచుకోగా, లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. నికోలస్ పూరన్ (63), మిచెల్ మార్ష్ (44) మెరుపులు మెరిపించారు. అయితే, ముంబై బ్యాటర్లు ఏమాత్రం తగ్గకుండా ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించారు. రోహిత్ శర్మ (84), ర్యాన్ రికెల్టన్ (83) అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై మరో 10 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ గెలిచినప్పటికీ, బుమ్రా ఫామ్ మాత్రం ముంబై యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us