India vs Pakistan Bilateral Series: బీసీసీఐ, పీసీబీ అంగీకరించే వరకు భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు ద్వైపాక్షిక సంబంధాలలో పాల్గొనబోవని ఐసీసీ తాత్కాలిక సీఈవో జియోఫ్ అల్లార్డిస్ అన్నారు. 2012లో పాకిస్తాన్ చివరి సారి భారత్‌లో పర్యటించింది. అప్పటి నుంచి రెండు దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. చిరకాల ప్రత్యర్థులు ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నమెంట్‌లలో మాత్రమే తలపడుతున్నాయి.
కాగా, ఐసీసీ దుబాయ్‌లో నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 24న ఆదివారం నాడు, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ టీంలు తలపడ్డాయి. ఈ మ్యాచులో బాబర్ అజామ్ మెన్ ఇన్ గ్రీన్ టీం 10 వికెట్ల తేడాతో కోహ్లీసేనను ఓడించింది. భారత్-పాకిస్థాన్ సంబంధాలపై, రెండు ఆసియా దేశాల మధ్య సంబంధాలను ఐసీసీ ప్రభావితం చేయదని అల్లార్డిస్ తెలపారు.
“ద్వైపాక్షిక క్రికెట్‌లో తలపడడం వారి దేశాల చేతుల్లో ఉంది. కానీ, మా ఈవెంట్‌లలో ఇరు దేశాల పోరు కచ్చితంగా ఆకట్టుకుంటోంది. ఈ విషయంలోనే మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే రెండు దేశాల బోర్డుల మధ్య సంబంధాలను ఐసీసీ ప్రభావితం చేయలేకపోతుంది ” అని ఆయన పేర్కొన్నారు.
“ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలంటే మాత్రం ఇరు దేశాల బోర్డులు అంగీకరించాల్సిందే. అది వారి ఇష్టం. ఇందులో ఐసీసీ జోక్యం కల్పించుకోదు” అని పేర్కొన్నారు.
2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్, పాకిస్తాన్ టీంలు కూడా భాగమే. అయితే అవి ఒకదానితో ఒకటి ఆడటానికి షెడ్యూల్ చేయలేదు. ఒకవేళ ఫైనల్‌కు అర్హత సాధిస్తే తటస్థ వేదికపై ఆడిస్తామని అల్లార్డిస్ పేర్కొన్నారు.
అయితే పాకిస్తాన్ మాజీలు మాత్రం ఇరు దేశాలు ద్వేపాక్షింగా తలపడకుంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ నిర్వహించడంలో ఏలాంటి ఉపయోగం లేదంటూ ఐసీసీపై విమర్శలు చేస్తున్నారు. ఇరుదేశాల మధ్య మ్యాచులు జరిగేలా ఐసీసీ చొరవ చూపాలని కోరారు.
ఒలింపిక్స్‌కు టీ20 అత్యుత్తమ ఫార్మాట్ అని కూడా అల్లార్డిస్ అభిప్రాయపడ్డారు. “ఇది చాలా చిన్నదైన ఫార్మాట్. అంతర్జాతీయ క్రీడగా క్రికెట్‌ను తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంది. టీ20 క్రికెట్‌ను ఒలింపిక్ క్రీడల్లో చేర్చాలని మేం కోరుతున్నాం. ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశాం ” అంటూ చెప్పుకొచ్చారు.
నవంబర్ 12 శుక్రవారం, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల టీ20 షెడ్యూల్‌ను ప్రకటించారు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే.