Nicholas Pooran: ఈ తరంలో బిగ్గెస్ట్ సిక్స్ హిట్టర్.. కట్ చేస్తే.. 29 ఏళ్లకే రిటైర్మెంట్
ప్రస్తుత క్రికెట్‌లో అత్యుత్తమ T20 బ్యాటర్‌గా గుర్తింపు పొందిన నికోలస్ పూరన్, అంతర్జాతీయ క్రికెట్‌కు మూడు ఫార్మాట్లలోనూ విరమణ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం క్రికెట్ అభిమానుల్లో ఆశ్చర్యం కలిగించింది, ఎందుకంటే ఆయన ఇంకా తన ప్రైమ్‌లో ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే క్లాసెన్ కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న సందర్భంలో పూరన్ నిర్ణయం మరింత చర్చనీయాంశమైంది. తన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్న పూరన్, వెస్ట్ ఇండీస్ జెర్సీ ధరించడం గర్వకారణమని పేర్కొన్నారు. అభిమానులు, కుటుంబం, సహచరులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం కొనసాగనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ T20 బ్యాటర్‌గా పరిగణింపబడుతున్న వెస్ట్ ఇండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్, సోమవారం రాత్రి అంతర్జాతీయ క్రికెట్‌కు మూడు ఫార్మాట్లలోనూ విరమణ చేస్తున్నట్లు ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశారు. ఈ ప్రకటన కొన్ని రోజుల క్రితమే దక్షిణాఫ్రికా స్టార్ హీన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన నేపథ్యంలో వెలువడింది. పూరన్ అయితే ఇప్పటికీ ఫ్రాంచైజీ లీగ్‌లలో కొనసాగనున్నారు. అయితే, ఎక్కువ మంది ప్లేయర్లు తమ ప్రైమ్‌లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ ఫ్రాంచైజీ లీగ్‌లపై దృష్టి పెట్టడాన్ని చూస్తే, ఈ ధోరణి క్రికెట్ భవిష్యత్‌పై ప్రశ్నలు వేస్తోంది.
గత కొన్ని సంవత్సరాల్లో అనేకమంది క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌ను వదిలేసి పూర్తిగా ఫ్రాంచైజీ లీగ్‌లపై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. పూరన్, వెస్ట్ ఇండీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా కలిగి ఉన్నారు. ఇప్పుడు అతనూ అదే బాట పట్టిన తాజా ఉదాహరణ.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించిన పూరన్ ఇలా పేర్కొన్నారు.. “చాలా ఆలోచనలు, పునర్విమర్శల తర్వాత, నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అని ఆయన తెలిపారు. మనమందరం ప్రేమించే ఈ ఆట నాకు చాలా ఇచ్చింది, ఇంకా ఇస్తూనే ఉంటుంది — ఆనందం, అర్థవంతమైన జీవితం, మరచిపోలేని జ్ఞాపకాలు, వెస్ట్ ఇండీస్ ప్రజలను ప్రాతినిధ్యం వహించే గౌరవం. ఆ మారూన్ జెర్సీ ధరించడం, జాతీయ గీతాన్ని ఆలపించడం, మైదానంలో ప్రతి సారి నా శక్తినంతా ధారపోసి ఆడటం… ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం చాలా కష్టం. జట్టుకు నాయకత్వం వహించడం నా జీవితంలో ఒక గొప్ప గౌరవం.
ఫ్యాన్స్‌కు.. మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. కష్ట సమయంలో మీరు నన్ను ఆదరించారు, మంచి సమయంలో నాతోపాటు ఉత్సాహంగా జరుపుకున్నారు. నా కుటుంబం, మిత్రులు, సహచర క్రీడాకారులకు ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచినందుకు ధన్యవాదాలు. మీ నమ్మకం, మద్దతు నా విజయానికి ఆధారాలు. ఇంతటితో నా అంతర్జాతీయ ప్రయాణం ముగుస్తున్నా, వెస్ట్ ఇండీస్ క్రికెట్ పట్ల నా ప్రేమ ఎప్పటికీ మిగిలే ఉంటుంది. జట్టుకు, మా ప్రాంతానికి ముందున్న ప్రయాణంలో విజయాలు మరియు బలాన్ని కోరుకుంటున్నాను.
29 ఏళ్ల పూరన్, వెస్ట్ ఇండీస్ తరఫున అత్యధికంగా T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచారు. మొత్తం 106 మ్యాచ్‌ల్లో పాల్గొన్న ఆయన, 2,275 పరుగులతో జట్టుకు టాప్ స్కోరర్ కూడా. ఇది ఒక యుగానికి ముగింపు, కానీ మరో క్రికెట్ యాత్రకు ఆరంభం.
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..