Harry Brook: ఇంగ్లాండ్ నయా వైట్ బాల్ కెప్టెన్‌గా మాజీ SRH బుల్లోడు! అఫీషియల్ గా ప్రకటించిన ECB బోర్డు

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు అశించిన విధంగా ప్రదర్శన ఇవ్వకపోవడంతో జోస్ బట్లర్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. దాంతో యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను ECB కొత్త వైట్-బాల్ కెప్టెన్‌గా ప్రకటించింది. కెప్టెన్సీ పట్ల హ్యారీ భావోద్వేగంగా స్పందించి, తన కుటుంబం, కోచ్‌లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇంగ్లాండ్ జట్టు గెలుపు దిశగా నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని, ఇది తన కెరీర్‌లో ఒక చారిత్రక మలుపని తెలిపాడు.

Harry Brook: ఇంగ్లాండ్ నయా వైట్ బాల్ కెప్టెన్‌గా మాజీ SRH బుల్లోడు! అఫీషియల్ గా ప్రకటించిన ECB బోర్డు
Harry Brook

Updated on: Apr 07, 2025 | 7:14 PM

ఇంగ్లాండ్ క్రికెట్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. జోస్ బట్లర్ రాజీనామా అనంతరం, యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను కొత్త వైట్-బాల్ కెప్టెన్‌గా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకటించింది. ఇటీవల ముగిసిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో బట్లర్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో, హ్యారీ బ్రూక్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించబడినట్లు ECB అధికారిక ప్రకటన విడుదల చేసింది. బ్రూక్ గతంలోనూ జట్టుకు వైట్-బాల్ వైస్-కెప్టెన్‌గా ఎంపికై, బట్లర్ గాయపడిన సమయంలో 2024లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు ఆయనకు ఈ భారీ బాధ్యత లభించడం అతని కెరీర్‌లో కొత్త అధ్యాయంగా నిలిచింది.

కెప్టెన్‌గా నియమితుడైన అనంతరం బ్రూక్ స్పందిస్తూ, “ఇంగ్లాండ్ వైట్-బాల్ కెప్టెన్‌గా ఎంపిక కావడం నిజంగా గొప్ప గౌరవం. చిన్ననాటి నుండి నేను యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించాలని, ఇంగ్లాండ్ తరపున ఆడాలని కలలు కన్నాను. ఇప్పుడు దేశానికి నాయకత్వం వహించే అవకాశం లభించడం నాకు చాలా సంతోషంగా ఉంది,” అంటూ భావోద్వేగంగా స్పందించాడు. తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్‌లకు కృతజ్ఞతలు తెలిపిన బ్రూక్, “వారు నాపై పెట్టిన విశ్వాసమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది” అని పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్ జట్టులో ప్రతిభావంతులైన అనేక మంది ఆటగాళ్లు ఉన్నారని చెబుతూ, తాను జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రధాన సిరీస్‌లు, ప్రపంచ కప్‌లు గెలిపించేందుకు పూర్తిగా సమర్పించుకుంటానని హ్యారీ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ మాట్లాడుతూ, “హ్యారీ బ్రూక్ రెండు ఫార్మాట్లలో కెప్టెన్‌గా బాధ్యతల స్వీకరణ మాకు ఆనందంగా ఉంది. అతను చాలాకాలంగా మా వారసత్వ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు. ఈ అవకాశం కొంచెం ముందుగా వచ్చినప్పటికీ, అతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి,” అని చెప్పారు.

ఇక గత రికార్డులను పరిశీలిస్తే, జోస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ 2022లో టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. కానీ ఆ తరువాత 2023 వన్డే ప్రపంచ కప్‌లో, అలాగే 2024 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో భారత్ చేతిలో ఓడిపోయి నిరాశపరిచింది. తాజాగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలోనే ఇంటికెళ్లిన ఇంగ్లాండ్, బట్లర్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీంతో ఆయన రాజీనామా చేయగా, హ్యారీ బ్రూక్ కొత్త నాయ‌కుడిగా నియమితుడయ్యాడు.

ఇకపై బ్రూక్ నాయకత్వంలో ఇంగ్లాండ్ వైట్-బాల్ జట్లు కొత్త దిశలో పయనించనున్నాయి. యువత, దూకుడుతో కూడిన ఆత్మవిశ్వాసం, క్రికెట్‌పై ఉన్న లోతైన అవగాహన అతనికి ప్రధాన బలం. కొత్త కెప్టెన్‌గా, అతను జట్టును ఎంతవరకు విజయాల దిశగా నడిపించగలడో చూడాలి. అన్ని విధాలా ఇది బ్రూక్ కెరీర్‌లో చారిత్రక మలుపుగా మారింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..