IND vs NZ : ఇండియా బ్యాటర్ల దెబ్బకు వణికిపోయిన సాంట్నర్..భారత్‌ను ఓడించాలంటే అదొక్కటే మార్గమట
IND vs NZ : రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా సృష్టించిన విధ్వంసానికి న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ దిమ్మతిరిగిపోయింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 15.2 ఓవర్లలోనే ఊదేయడం చూసి సాంట్నర్ షాక్‌కు గురయ్యాడు.

IND vs NZ : రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా సృష్టించిన విధ్వంసానికి న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ దిమ్మతిరిగిపోయింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 15.2 ఓవర్లలోనే ఊదేయడం చూసి సాంట్నర్ షాక్‌కు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్‌ను ఓడించాలంటే ఎంత స్కోరు చేయాలని అడిగిన ప్రశ్నకు సాంట్నర్ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయిస్తూనే, టీమిండియా పవర్‌ను చాటిచెబుతోంది.
టీమ్ ఇండియా బ్యాటర్ల విధ్వంసకర బ్యాటింగ్ తీరు చూస్తుంటే ప్రత్యర్థి కెప్టెన్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం (జనవరి 23) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. సాధారణంగా ఏ టీ20 మ్యాచ్‌లోనైనా 209 పరుగుల లక్ష్యం అంటే అది కొండంత స్కోరు. కానీ టీమిండియా మాత్రం ఆ లక్ష్యాన్ని ఒక ఆట ఆడుకుంది. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ కేవలం 6 పరుగులకే అవుట్ అయినా.. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం చేయడంతో భారత్ మరో 28 బంతులు మిగిలి ఉండగానే విజయం అందుకుంది.
ఈ ఘోర పరాజయం తర్వాత ప్రెజంటేషన్ సెర్మనీలో మిచెల్ సాంట్నర్ చాలా నీరసంగా కనిపించాడు. “ఇండియా లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుపై ఎంత స్కోరు చేస్తే సరిపోతుంది?” అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సాంట్నర్ నవ్వుతూ, “నా ఉద్దేశం ప్రకారం 300 పరుగులు చేయాలి” అని బదులిచ్చాడు. ఈ సమాధానం విన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. భారత్ దగ్గర ప్రతి బ్యాటర్‌కు స్వేచ్ఛగా ఆడే లైసెన్స్ ఉందని, అందుకే మొదటి బంతి నుంచే వారు విరుచుకుపడుతున్నారని సాంట్నర్ కొనియాడాడు.
సాంట్నర్ మాట్లాడుతూ.. “మేము మంచి స్కోరే సాధించామనుకున్నాం. కానీ ఇండియా బ్యాటింగ్ చూశాక 200 లేదా 210 పరుగులు అసలు సరిపోవని అర్థమైంది. ఇక్కడ వికెట్లు చాలా బాగున్నాయి, దానికి తోడు ఇండియా బ్యాటర్లు చాలా లోతు వరకు ఉన్నారు. మా బౌలర్లు శ్రమించినా ప్రయోజనం లేకుండా పోయింది. మేము ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత క్రికెట్‌లో 200 రన్స్ అనేవి సేఫ్ టార్గెట్ కాదని తేలిపోయింది” అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
భారత్ ఈ రన్ ఛేజ్‌తో ఒక అరుదైన రికార్డును కూడా తన పేరిట లిఖించుకుంది. కేవలం 10 పరుగుల లోపే రెండు వికెట్లు కోల్పోయి, 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా భారత్ నిలిచింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మూడో టీ20 గెలిస్తే కివీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. సాంట్నర్ వ్యాఖ్యలు చూస్తుంటే కివీస్ జట్టు భారత్ బ్యాటింగ్ పవర్ కి ఎంతలా భయపడుతుందో అర్థమవుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
