AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : లార్డ్స్ మైదానంలో రో‘హిట్’ షో.. 138 పరుగుల క్లాసిక్ ఇన్నింగ్స్‌తో బద్ధలైన 5 రికార్డులు

Rohit Sharma : లార్డ్స్ వేదికగా రోహిత్ శర్మ 138 పరుగులతో చరిత్ర సృష్టించాడు. తొలి భారతీయుడిగా లార్డ్స్‌లో వన్డే సెంచరీ బాదిన హిట్‌మ్యాన్ ఏకంగా ఐదు అరుదైన ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లీతో కలిసి మరో అరుదైన భాగస్వామ్య మైలురాయిని కూడా అందుకున్నాడు.

Rohit Sharma : లార్డ్స్ మైదానంలో రో‘హిట్’ షో.. 138 పరుగుల క్లాసిక్ ఇన్నింగ్స్‌తో బద్ధలైన 5 రికార్డులు
Rohit Sharma
Rakesh
|

Updated on: Jul 20, 2026 | 6:55 AM

Share

Rohit Sharma : ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సరికొత్త విధ్వంసం సృష్టించాడు. లార్డ్స్ మైదానంలో భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రోహిత్ శర్మ, ఇంగ్లీష్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విరుచుకుపడ్డాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా క్రీజులో నిలదొక్కుకున్నప్పటికీ, ఆ తర్వాత తన సహజ సిద్ధమైన దూకుడును ప్రదర్శించాడు. కేవలం 110 బంతుల్లోనే 17 ఫోర్లు, 5 అద్భుతమైన సిక్సర్లతో 138 పరుగులు చేసి జట్టుకు వీరోచిత ఇన్నింగ్స్ అందించాడు. ఈ అద్భుతమైన సెంచరీతో రోహిత్ శర్మ ఒకే దెబ్బకు 5 చారిత్రాత్మక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

లార్డ్స్‌లో వన్డే సెంచరీ బాదిన తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు

లార్డ్స్ మైదానంలో భారత్‌కు ఉన్న అతిపెద్ద లోటును రోహిత్ శర్మ ఈ ఇన్నింగ్స్‌తో పూరించేశాడు. లార్డ్స్ మైదానంలో ఇప్పటివరకు ఏ ఒక్క భారతీయ బ్యాటర్ కూడా వన్డేల్లో సెంచరీ సాధించలేకపోయాడు. గతంలో 2004లో సౌరవ్ గంగూలీ చేసిన 90 పరుగులే ఇక్కడ ఒక భారతీయ బ్యాటర్‌కు అత్యధిక స్కోరుగా ఉండేది. అయితే రోహిత్ శర్మ 138 పరుగులు చేసి, గత 22 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఆ రికార్డును బద్దలు కొట్టడంతో పాటు, లార్డ్స్ మైదానంలో వన్డే శతకం సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

లార్డ్స్ పిచ్‌పై అత్యంత పెద్ద వయస్కుడైన సెంచరీ హీరోగా రోహిత్

వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని రోహిత్ శర్మ మరోసారి నిరూపించాడు. తన 39 ఏళ్ల 80 రోజుల వయసులో లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించడం ద్వారా, ఈ చారిత్రాత్మక గ్రౌండ్‌లో వన్డే శతకం బాదిన అత్యంత పెద్ద వయస్కుడైన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ వయసులోనూ అంతర్జాతీయ స్థాయిలో అంతటి ఫిట్‌నెస్‌తో, షాట్ సెలెక్షన్‌తో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటం పట్ల ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు రోహిత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇంగ్లాండ్ గడ్డపై తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్న కెప్టెన్

ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై ఒక భారతీయ బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు రికార్డును కూడా రోహిత్ తిరగరాశాడు. విశేషమేమిటంటే, గతంలో తన పేరిట ఉన్న రికార్డునే రోహిత్ ఈరోజు దాటేశాడు. 2018లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్‌పై రోహిత్ శర్మ చేసిన 137 నాటౌట్ పరుగులే ఇప్పటివరకు టాప్‌లో ఉండగా, ఇప్పుడు లార్డ్స్‌లో చేసిన 138 పరుగులతో ఆ రికార్డును తిరగరాసి మళ్లీ మొదటి స్థానంలో నిలిచాడు.

సంగక్కర-దిల్షాన్ కాంబోను వెనక్కి నెట్టిన రో-కో జోడీ

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల జోడీ మరో అరుదైన మైలురాయిని దాటింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సెంచరీ (100+) భాగస్వామ్యాలు నెలకొల్పిన రెండో జోడీగా రోహిత్-విరాట్ నిలిచారు. వీరిద్దరూ కలిసి వన్డేల్లో 21వ సారి 100కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, శ్రీలంక దిగ్గజాలు కుమార్ సంగక్కర-తిలకరత్నే దిల్షాన్ (20 సార్లు) రికార్డును దాటేశారు. ఈ జాబితాలో 26 సెంచరీ భాగస్వామ్యాలతో సచిన్ టెండూల్కర్ – సౌరవ్ గంగూలీ జోడీ అగ్రస్థానంలో ఉంది.

విదేశీ గడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు బాదిన దిగ్గజంగా రోహిత్

తన సొంత దేశం కాకుండా ఏదైనా ఒక నిర్దిష్ట విదేశీ దేశంలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై రోహిత్‌కు ఇది 8వ వన్డే శతకం. దీని ద్వారా యుఏఈలో 7 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్, సయీద్ అన్వర్ రికార్డులతో పాటు భారతదేశంలో 7 సెంచరీలు చేసిన ఏబీ డివిలియర్స్, క్వింటన్ డికాక్ రికార్డులను రోహిత్ అధిగమించి సింగిల్‌గా టాప్ పొజిషన్‌ను సొంతం చేసుకున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us