
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఒకప్పుడు ఎన్నో సెంచరీలు బాదిన ఈ ఆటగాడు.. గత మూడేళ్లలో ఒక్కసారి కూడా మూడంకెల స్కోరును అందుకోలేకపోయాడు. దీంతో అతని ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఆటగాళ్లు సైతం కోహ్లీకి విశ్రాంతినివ్వాలని లేదా జట్టు నుంచి తప్పించాలని సూచిస్తున్నారు. ఈక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘టెస్ట్‌ల్లో 450 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌ను పక్కన పెట్టినప్పుడు ఎంతో కాలంగా విఫలమవుతోన్న విరాట్ను టీ20ల్లో ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదు ‘ అంటూ ప్రశ్నించారు.
వారికి అన్యాయం చేస్తున్నట్లే..
‘టీ20లలో కోహ్లీని బెంచ్‌కు పరిమితం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. వరల్డ్ నెం.2 బౌలరైన అశ్విన్ ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్‌కు పక్కన పెట్టారు. అలాంటిది ఒకప్పుడు నెం.1 బ్యాటర్‌గా ఉన్న కోహ్లీని టీ20 మ్యాచ్‌లకు దూరం పెట్టాలి. అతను గత వైభవంతోనే జట్టులో కొనసాగుతున్నాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు తగిన అవకాశాలు ఇవ్వకపోతే వారికి జట్టు యాజమాన్యం అన్యాయం చేస్తున్నట్టే. ఈ విషయంపై సెలెక్షన్ కమిటీ ఆలోచించాలి’ అని చెప్పుకొచ్చారు కపిల్. కాగా ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్ టెస్ట్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు విరాట్. మొదటి ఇన్నింగ్స్‌లో 11, రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులు చేసి అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు.