
పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటూ వస్తోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 దశ నుంచే పాకిస్తాన్ నిష్క్రమించడం అభిమానులను నిరాశపరిచింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్ 2-1 తేడాతో ఓటమి పాలైంది. సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో ఓడిపోవడంతో పాకిస్తాన్ క్రికెట్‌పై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి, జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మోహసిన్ నక్విపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పుడున్న పరిస్థితులలో నెదర్లాండ్స్ వంటి జట్లు కూడా పాకిస్తాన్‌తో సిరీస్ ఆడాలని కోరుకుంటాయని, పాకిస్తాన్‌ను ఓడించి టెస్ట్ హోదా పొందాలని ఆశిస్తాయని కమ్రాన్ అక్మల్ వ్యాఖ్యానించారు. అటువంటి జట్లను తప్పు పట్టాల్సిన అవసరం లేదని, పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితే దారుణంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఇప్పుడు మీరు ఎలాగో మ్యాచ్‌లు గెలవరు, మరి ఐసీసీ ట్రోఫీలు దొంగిలించి తీసుకొస్తారా?” అని మోహసిన్ నక్విపై కమ్రాన్ అక్మల్ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ వివరాలలోకి వెళితే, నిర్ణిత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ ఐదు వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన పాకిస్తాన్ జట్టు 279 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో ఓడి, సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. ఈ ఓటమి పరంపర, జట్టు ప్రదర్శనపై కమ్రాన్ అక్మల్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే, పీసీబీ చైర్మన్ మోహసిన్ నక్విపై మరింత తీవ్ర విమర్శలు చేశారు. గత ఏడాది జరిగిన ఆసియా కప్‌కు సంబంధించిన ఒక వివాద సంఘటనను కూడా కమ్రాన్ అక్మల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆసియా కప్‌లో టీం ఇండియా విజేతగా నిలిచినప్పుడు, మోహసిన్ నక్వి చేతుల మీదుగా కప్పును అందుకునేందుకు భారత్ నిరాకరించింది. ఆ వెంటనే మోహసిన్ నక్వి కప్పును తీసుకొని అక్కడి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆసియా కప్పు టీం ఇండియాకు అందజేయలేదని అక్మల్ గుర్తుచేశారు. ఐసీసీ ట్రోఫీలను కూడా ఇలాగే “దోచుకొని” సాధించాలని పాకిస్తాన్ బోర్డు భావిస్తోందని కమ్రాన్ అక్మల్ విమర్శించారు. పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తు పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది చదవండి: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాస్తే.. అప్పు ఇచ్చినవాడు చనిపోయినా మీ డబ్బు వెనక్కి