Ind vs Eng : భారత్ మీద అరుదైన రికార్డు క్రియేట్ చేసిన ఒకే ఒక్కడు.. చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ ప్లేయర్
భారత్‌పై టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో జో రూట్ అగ్రస్థానంలో నిలిచాడు. అతను 3000కు పైగా పరుగులు సాధించి ఈ మైలురాయిని చేరుకున్నాడు. రూట్ తర్వాత రెండో స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ఉన్నాడు, అతను భారత్‌పై 2,555 పరుగులు చేశాడు.

Ind vs Eng : లండన్‌లోని లార్డ్స్‌లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్ట్ మ్యాచ్‌లో జో రూట్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత్‌పై 3,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రెడ్-బాల్ ఫార్మాట్‌లో భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికే జో రూట్ పేరున ఉంది. భారత్‌పై తన 60వ టెస్ట్ ఇన్నింగ్స్‌లో రూట్ ఈ ఘనతను సాధించాడు. లార్డ్స్ టెస్ట్‌లో 45 పరుగులు చేయగానే అతను ఈ చారిత్రక మైలురాయిని అందుకున్నాడు. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు జో రూట్ భారత్‌పై 59 ఇన్నింగ్స్‌లలో 2,955 పరుగులు చేశాడు. మూడో టెస్ట్ మ్యాచ్‌లో తన ఇన్నింగ్స్‌లో 45 పరుగులు జోడించగానే అతను ఈ చారిత్రక మైలురాయిని చేరుకున్నాడు. భారత్ దాదాపు 93 సంవత్సరాల క్రితం తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 300 మందికి పైగా ఆటగాళ్లు భారత్‌పై టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. వారందరినీ వెనక్కి నెట్టి జో రూట్ భారత్‌పై 3,000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
జో రూట్ భారత్‌పై మూడు వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో అతని తర్వాత రెండో స్థానంలో రికీ పాంటింగ్ ఉన్నాడు. పాంటింగ్ టీమిండియాపై 2,555 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌కు చెందిన మరో మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్, భారత్‌పై 2,431 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్, భారత్‌పై ఇప్పటివరకు 2,356 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ లెజెండ్ క్లైవ్ లాయిడ్ కూడా ఉన్నాడు, అతను తన టెస్ట్ కెరీర్‌లో భారత్‌పై 2,344 పరుగులు చేశాడు.
భారత్‌పై అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్లు
* జో రూట్ – 3000+ పరుగులు
* రికీ పాంటింగ్ – 2,555 పరుగులు
* అలిస్టర్ కుక్ – 2,431 పరుగులు
* స్టీవ్ స్మిత్ – 2,356 పరుగులు
* క్లైవ్ లాయిడ్ – 2,344 పరుగులు
జో రూట్ భారత మైదానాల్లో కూడా మంచి టెస్ట్ రికార్డును కలిగి ఉన్నాడు. అతను ఇప్పటివరకు 30 ఇన్నింగ్స్‌లలో 45కు పైగా సగటుతో 1,272 పరుగులు చేశాడు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




