AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravindra Jadeja: జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ

Ravindra Jadeja: న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు రవీంద్ర జడేజాను ఎంపిక చేయకపోవడంపై చర్చ మొదలైంది. భారత మాజీ క్రికెటర్ చటేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు చేశారు. అక్షర్ పటేల్‌కు ఎక్కువ అవకాశాలు ఇస్తుండటంతో జడేజా వన్డే భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

Ravindra Jadeja: జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
Ravindra Jadeja
Rakesh
|

Updated on: Nov 01, 2026 | 8:13 AM

Share

Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్‌పై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. న్యూజిలాండ్‌తో నవంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. దీంతో జడేజాను వన్డే ప్రణాళికల నుంచి తప్పించారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా కూడా ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జడేజాను వన్డేల్లో కొనసాగించాలని జట్టు భావిస్తే న్యూజిలాండ్ సిరీస్‌కు తప్పకుండా ఎంపిక చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

అక్షర్‌కు అవకాశాలు.. జడ్డూకు నిరాశేనా?

ప్రస్తుతం భారత వన్డే జట్టులో అక్షర్ పటేల్‌కు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందని పుజారా గుర్తుచేశారు. అక్షర్‌ను ప్రధాన ఆల్‌రౌండర్‌గా చూస్తున్నప్పుడు జడేజాకు అవకాశాలు తగ్గే పరిస్థితి కనిపిస్తోందన్నారు. జడేజా వయసును దృష్టిలో పెట్టుకుని టీమ్ మేనేజ్‌మెంట్ అతడితో మాట్లాడి ఉండొచ్చని పుజారా అభిప్రాయపడ్డారు. ఇకపై టెస్టులపైనే దృష్టి పెట్టాలని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడిని ఎంపిక చేసే ఆలోచన లేదని చెప్పి ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే ఇవి పుజారా వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. జడేజా వన్డే కెరీర్ ముగిసిందని బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు.

గత సిరీస్‌లో ఆడిన జడేజా

జడేజా ఇటీవలే వన్డే జట్టులో ఆడటం గమనార్హం. సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు భారత జట్టులో చోటు దక్కించుకోవడమే కాకుండా, తుది జట్టులోనూ ఆడాడు. అలాంటి ఆటగాడిని ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో అభిమానుల్లో సందేహాలు పెరిగాయి. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా వన్డే ప్రపంచకప్ నిర్వహించనున్నాయి. ఈ మెగా టోర్నీకి జట్టును సిద్ధం చేసే సమయంలో జడేజా లాంటి అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్‌కు చోటు లేకపోవడం చర్చనీయాంశమైంది.

నవంబర్ 4 నుంచి భారత్, న్యూజిలాండ్ వన్డేలు

భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు వన్డేల సిరీస్ నవంబర్ 4న ప్రారంభం కానుంది. ఆ తర్వాత నవంబర్ 19 నుంచి టెస్టు సిరీస్ మొదలవుతుంది. టెస్టులకు సిద్ధమయ్యేందుకు రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చివరి రెండు వన్డేలకు అందుబాటులో ఉండడని సమాచారం. అతడి స్థానంలో చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మొదటి మూడు వన్డేలకు గిల్ నాయకత్వం వహిస్తాడు. ఈ సిరీస్‌లో అక్షర్ పటేల్‌కు ఎలాంటి బాధ్యతలు ఇస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

రెండు జట్లకు వేర్వేరు కూర్పులు

మొదటి మూడు వన్డేలకు ప్రకటించిన భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన ధీర్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. చివరి రెండు వన్డేలకు జట్టులో కొన్ని మార్పులు జరిగాయి. ఆ మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, ఇషాన్ కిషన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. తిలక్ వర్మ, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, కుమార్ కుశాగ్రలకు కూడా చోటు కల్పించారు. ఈ మార్పుల మధ్య జడేజా తిరిగి వన్డే జట్టులోకి వస్తాడా? లేక టెస్టులకే పరిమితమవుతాడా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us