Irani Cup: దంచికొట్టిన ద్రవిడ్ శిష్యులు.. 47 ఫోర్లు, 5 సిక్సర్లతో 367 పరుగులు.. బౌలర్ల ఊచకోతే..

|

Mar 02, 2023 | 8:58 AM

ఓవైపు ఇండోర్‌ స్టేడియంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా లాంటి సీనియర్ ప్లేయర్స్ తడబడుతుండగా, మరోవైపు గ్వాలియర్‌ స్టేడియంలో టీమిండియా యువ ప్లేయర్స్ దంచికొట్టారు.

Irani Cup: దంచికొట్టిన ద్రవిడ్ శిష్యులు.. 47 ఫోర్లు, 5 సిక్సర్లతో 367 పరుగులు.. బౌలర్ల ఊచకోతే..
Irani Cup
Follow us on

ఓవైపు ఇండోర్‌ స్టేడియంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ల ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా లాంటి సీనియర్ ప్లేయర్స్ తడబడుతుండగా, మరోవైపు గ్వాలియర్‌ స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా యువ ప్లేయర్స్ దంచికొట్టారు. మధ్యప్రదేశ్‌తో జరుగుతోన్న ఈ టెస్ట్ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీలతో ప్రత్యర్ధి బౌలర్లను బెంబేలెత్తించారు. మరి వారెవరు..? ఆ స్కోర్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.?

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియాకు.. ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌(2)ను తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చాడు మధ్యప్రదేశ్ బౌలర్ ఆవేశ్ ఖాన్. అయితేనేం మరో వికెట్ పడకుండా కాపాడుకుంది రెస్ట్ ఆఫ్ ఇండియా. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(154), యశస్వి జైస్వాల్(213) రెండో వికెట్‌కు 350కి పైగా పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీళ్లిద్దరి తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది.

బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై జైస్వాల్ చెలరేగిపోయాడు. 259 బంతుల్లో 213 పరుగులు చేశాడు. ఇది అతడి ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఎనిమిదో సెంచరీ. ఈ ముంబై బ్యాట్స్‌మెన్ 30 ఫోర్లు, 3 సిక్సర్లతో ఆఖరి సెషన్‌ వరకు బరిలో నిలిచాడు. అలాగే తన కెరీర్‌లో 15వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న జైస్వాల్‌కి ఇది మూడో డబుల్ సెంచరీ. అటు బెంగాల్ తరఫున ఆడిన ఓపెనర్ ఈశ్వరన్ 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 240 బంతుల్లో 154 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈశ్వరన్‌కి ఇది 22వ సెంచరీ.

కాగా, ఈ సీజన్‌ రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలతో పాటు బంగ్లాదేశ్‌ పర్యటనలోనూ యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీలతో అదరగొట్టాడు. ఇది మాత్రమే కాదు, భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఒకే సీజన్‌లో దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలలో డబుల్ సెంచరీలు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా జైస్వాల్ రికార్డు సృష్టించాడు.