Vipraj Nigam : ఆమె వీడియోలు బయటపెడతానని బెదిరిస్తుందని సార్.. పోలీసులను ఆశ్రయించిన ఐపీఎల్ స్టార్
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున అద్భుతమైన ఆల్-రౌండర్ ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్ విప్రజ్ నిగమ్ ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. మైదానంలో దూకుడుగా ఆడే ఈ యువ ఆటగాడు, ఒక మహిళ చేతిలో బ్లాక్‌మెయిలింగ్‌కు గురవుతున్నాడు.

Vipraj Nigam : ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున అద్భుతమైన ఆల్-రౌండర్ ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్ విప్రజ్ నిగమ్ ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. మైదానంలో దూకుడుగా ఆడే ఈ యువ ఆటగాడు, ఒక మహిళ చేతిలో బ్లాక్‌మెయిలింగ్‌కు గురవుతున్నాడు. అంతేకాదు, ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు పరువు తీస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంటూ, ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఉత్తరప్రదేశ్‌లోని హైదర్‌గఢ్ ప్రాంతానికి చెందిన యువ ఆల్-రౌండర్ విప్రజ్ నిగమ్, తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు ఒక యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం నాడు బారాబంకి నగర కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు దాఖలు చేశాడు. విప్రజ్ నిగమ్ తన వ్యక్తిగత జీవితంలో సదరు యువతి జోక్యం చేసుకుంటుందని, అనుచిత డిమాండ్లు చేసి, వాటిని అంగీకరించకపోవడంతో ప్రైవేట్ వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నాడు.
యువతి నంబర్‌ను బ్లాక్ చేసిన తర్వాత, విప్రజ్‌కు ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి పదేపదే కాల్స్, మెసేజ్‌లు రావడం మొదలైంది. ఈ కాల్స్‌లో అతడిని, అతని కుటుంబాన్ని బహిరంగంగా అవమానిస్తామని హెచ్చరించారు. ఈ బెదిరింపులన్నీ తన క్రికెట్ కెరీర్‌ను నాశనం చేయడానికి , మానసికంగా కృంగదీయడానికి చేసిన పథకం ప్రకారం కుట్ర అని విప్రజ్ నిగమ్ ఆరోపించాడు.
సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న విప్రజ్ నిగమ్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సుధీర్ కుమార్ సింగ్‌కు ఈ సంఘటన గురించి మొత్తం వివరించాడు. పోలీసులు వెంటనే ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించి కేసు నమోదు చేశారు. కొత్వాల్ సుధీర్ కుమార్ సింగ్ ఈ విషయంలో డిజిటల్ సాక్ష్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కాల్ వివరాలు, మెసేజ్‌లు, సంబంధిత నంబర్‌లను దర్యాప్తు చేసేందుకు సైబర్ సెల్‌ను కూడా ఈ కేసులో భాగం చేశారు. కాల్స్ విదేశీ నంబర్ల నుంచి రావడంతో, ఈ దర్యాప్తు కోసం విదేశీ ఏజెన్సీల సహకారం కూడా అవసరమయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ తరఫున దేశీయ క్రికెట్ ఆడే విప్రజ్ నిగమ్, ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2025లో విప్రజ్ నిగమ్ మొత్తం 14 మ్యాచ్‌లు ఆడాడు. అతను 179.74 స్ట్రైక్ రేట్‌తో 142 పరుగులు చేశాడు. బౌలర్‌గా 11 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు 9.12గా ఉంది. విప్రజ్ ఇప్పటివరకు 5 ఫస్ట్ క్లాస్, 6 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




