Mustafizur Rahman : కోట్లు వదులుకుని చిల్లర కోసం పాకులాట.. ముస్తాఫిజుర్ పతనానికి పునాది పడిందా?
Mustafizur Rahman : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎల్ 2026 నుంచి ఉద్వాసనకు గురైన కొద్ది రోజుల్లోనే ఆయన పాకిస్థాన్ సూపర్ లీగ్ బాట పట్టారు.

Mustafizur Rahman : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman) వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ 2026 నుంచి ఉద్వాసనకు గురైన కొద్ది రోజుల్లోనే ఆయన పాకిస్థాన్ సూపర్ లీగ్ బాట పట్టారు. అయితే అక్కడ ఆయనకు లభించే ధర చూసి క్రీడా విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఐపీఎల్‌లో కోట్లు పలికిన ఈ స్టార్ బౌలర్, ఇప్పుడు పాకిస్థాన్‌లో చిల్లర ధరకు ఆడేందుకు సిద్ధమవ్వడం సంచలనం సృష్టిస్తోంది.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు పోటీ పడ్డాయి. చివరికి కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం ఏకంగా రూ.9.20 కోట్ల భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది. అయితే, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, అక్కడ నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో అతడిపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దేశ ప్రయోజనాలు, భద్రతను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ అతడిని లీగ్ నుంచి తప్పించాలని కేకేఆర్ టీమ్‌ను ఆదేశించింది. దీంతో షారుఖ్ ఖాన్ జట్టు ముస్తాఫిజుర్‌ను జట్టు నుండి రిలీజ్ చేసింది.
ఐపీఎల్ నుంచి తలుపులు మూసుకుపోవడంతో ముస్తాఫిజుర్ ఇప్పుడు పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఆయన పీఎస్ఎల్‌లో కనిపించబోతున్నారు. గతంలో లాహోర్ ఖలందర్స్ తరపున ఆడిన ఆయన, ఇప్పుడు మళ్ళీ అదే జెర్సీలో కనిపించే అవకాశం ఉంది. పీఎస్ఎల్ డ్రాఫ్ట్ జనవరి 21న జరగనుండగా, లీగ్ మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభానికి కేవలం మూడు రోజుల ముందు ఈ లీగ్ మొదలవ్వడం విశేషం.
ఐపీఎల్‌కు, పీఎస్ఎల్‌కు ఉన్న ఆదాయ వ్యత్యాసం ముస్తాఫిజుర్ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో అతడికి అందాల్సిన రూ.9.20 కోట్లతో పోలిస్తే, పీఎస్ఎల్‌లో వచ్చే మొత్తం నామమాత్రమే. పాకిస్థాన్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడు డేవిడ్ వార్నర్. అతడికే సుమారు రూ.2.70 కోట్లు మాత్రమే దక్కాయి. అంటే ముస్తాఫిజుర్‌కు ఐపీఎల్ జీతంలో కనీసం నాలుగో వంతు కూడా దక్కే అవకాశం లేదు. కేవలం మొండితనం వల్ల కోట్లాది రూపాయల సంపాదనను ఆయన కోల్పోయారు.
ముస్తాఫిజుర్ ఉద్వాసనతో భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఘాటుగా లేఖ రాసింది. రాబోయే టి20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్‌లను భారత్‌లో కాకుండా శ్రీలంకలో నిర్వహించాలని డిమాండ్ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లు భారత్ రాబోరని తేల్చి చెప్పింది. దీనికి తోడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
