SG Sponsorship : కోత మొదలైంది.. బంగ్లాదేశ్ క్రికెటర్లతో అగ్రిమెంట్లు రద్దు చేసుకున్న భారత కంపెనీ
SG Sponsorship : భారత క్రికెట్ నియంత్రణ మండలి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య గొడవకు ప్రధాన కారణం ముస్తాఫిజుర్ రెహమాన్. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్‌ను బీసీసీఐ తప్పించడంతో బంగ్లాదేశ్ క్రీడా శాఖ, క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనికి ప్రతీకారంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలపై నిషేధం విధించింది.

SG Sponsorship : ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నట్లుగా భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ఉన్న వివాదాలు ఇప్పుడు స్పాన్సర్‌షిప్ ఒప్పందాలపై ప్రభావం చూపుతున్నాయి. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించిన నేపథ్యంలో దానికి ప్రతిగా భారతీయ కంపెనీలు కూడా తమ నిర్ణయాలను తీసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ బ్యాట్లు, కిట్లకు పేరుగాంచిన భారతీయ సంస్థ SG, బంగ్లాదేశ్ ఆటగాళ్లతో ఉన్న ఒప్పందాలన్నింటినీ తక్షణం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇకపై బంగ్లాదేశ్ క్రికెటర్లకు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించడానికి తాము ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ అగ్రశ్రేణి బ్యాటర్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా టి20 ప్రపంచకప్ 2026 కోసం కెప్టెన్‌గా ఎంపికైన లిట్టన్ దాస్ వంటి ఆటగాళ్లు ఇన్నాళ్లూ SG బ్యాట్లతోనే ఆడుతూ వచ్చారు. సౌమ్య సర్కార్ వంటి ఇతర కీలక ఆటగాళ్లు కూడా ఈ కంపెనీ కిట్ స్పాన్సర్‌షిప్‌ను కలిగి ఉన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ ఒప్పందాలు రద్దు కావడంతో, అంతర్జాతీయ టోర్నీలకు ముందు కొత్త స్పాన్సర్లను వెతుక్కోవడం వారికి పెను సవాలుగా మారింది. కిట్ స్పాన్సర్‌షిప్ లేకపోవడం వల్ల ఆర్థికంగానే కాకుండా, తమకు అలవాటైన నాణ్యమైన బ్యాట్లను కోల్పోవడం ఆటగాళ్ల ప్రదర్శనపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య గొడవకు ప్రధాన కారణం ముస్తాఫిజుర్ రెహమాన్. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్‌ను బీసీసీఐ తప్పించడంతో బంగ్లాదేశ్ క్రీడా శాఖ, క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనికి ప్రతీకారంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలపై నిషేధం విధించింది. ఈ రాజకీయ క్రీడాపరమైన గొడవల నేపథ్యంలో, భారతీయ బ్రాండ్ అయిన SG కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా బంగ్లాదేశీయులతో తన బంధాన్ని తెంచుకుంది.
కేవలం SG మాత్రమే కాకుండా, ఇతర భారతీయ క్రీడా పరికరాల తయారీ సంస్థలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ క్రికెట్ మార్కెట్‌లో భారత్‌కు ఉన్న ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యధిక ఆదాయం కలిగిన బీసీసీఐని కాదని బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. స్పాన్సర్లు దూరం కావడం, ప్రసార హక్కుల విషయంలో గందరగోళం నెలకొనడం వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా కునారిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
