IPL 2026 Points Table : కొద్ది గంటల్లోనే మారిన సీన్.. ఢిల్లీకి షాకిచ్చి నెంబర్ 1 పీఠం ఎక్కిన రాజస్థాన్ రాయల్స్
IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 డబుల్ హెడర్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానానికి పడిపోగా, చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి స్థానంలో ఉంది.గుజరాత్ టైటాన్స్ ఓడిపోయినప్పటికీ రన్ రేట్ పరంగా 7వ స్థానంలోనే స్థిరంగా ఉంది.

IPL 2026 Points Table : ఐపీఎల్ 19వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతుంటే, పాయింట్ల పట్టికలో ఈక్వేషన్స్ క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఏప్రిల్ 4న జరిగిన ఈ సీజన్ తొలి డబుల్ హెడర్ (ఒకేరోజు రెండు మ్యాచ్‌లు) తర్వాత పాయింట్ల టేబుల్ పూర్తిగా తలకిందులైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కొద్ది గంటల పాటు అనుభవించిన అగ్రస్థానాన్ని రాజస్థాన్ రాయల్స్ లాగేసుకుంది. గుజరాత్ టైటాన్స్ ఓటమి ఢిల్లీ కొంపముంచగా, రాజస్థాన్ కు పట్టం కట్టింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్, అప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న తన ర్యాంకును నేరుగా మొదటి స్థానానికి తీసుకెళ్లింది. దీనివల్ల పంజాబ్ కింగ్స్ రెండో స్థానానికి, రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానానికి పడిపోయాయి. అయితే ఢిల్లీ అనుభవించిన ఈ బాద్‌షా గిరి కేవలం కొన్ని గంటలకే పరిమితమైంది. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను రాజస్థాన్ రాయల్స్ ఓడించడంతో పాయింట్ల లెక్కలు మళ్లీ మారిపోయాయి. గుజరాత్ ఓటమి వల్ల ఢిల్లీ తన అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది.
నెంబర్ వన్ సీటులో రాజస్థాన్ రాయల్స్
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలో 4 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ మూడు జట్లు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి అజేయంగా నిలిచాయి. అయితే రన్ రేట్ విషయంలో రాజస్థాన్ అందరికంటే ముందుంది. రాజస్థాన్ నెట్ రన్ రేట్ +2.233 గా ఉండటంతో అది నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (+1.170) రెండో స్థానంలో, పంజాబ్ కింగ్స్ (+0.637) మూడో స్థానంలో ఉన్నాయి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకే మ్యాచ్ ఆడి విజయం సాధించినప్పటికీ, మెరుగైన రన్ రేట్ (+2.907) తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
అట్టడుగున చెన్నై సూపర్ కింగ్స్
ఒకప్పుడు ఐపీఎల్‌ను శాసించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఈ సీజన్ ఆరంభంలో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సిఎస్కే అందరికంటే ఆఖరి స్థానంలో (10వ స్థానం) ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 9వ స్థానంలో నిలిచింది. డబుల్ హెడర్‌లో ఓడిన జట్ల విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్ ఒక స్థానాన్ని కోల్పోయి 5 నుంచి 6వ స్థానానికి పడిపోయింది. గుజరాత్ టైటాన్స్ ఓడిపోయినప్పటికీ రన్ రేట్ పరంగా 7వ స్థానంలోనే స్థిరంగా ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ 8వ స్థానంలో కొనసాగుతోంది.
రానున్న మ్యాచ్‌లతో మరిన్ని మార్పులు
ఐపీఎల్ 19వ సీజన్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. 10 జట్ల మధ్య జరుగుతున్న ఈ పోరులో ప్రతి మ్యాచ్ ఒక యుద్ధంలా మారుతోంది. రన్ రేట్ అనేది ప్లే ఆఫ్స్ రేసులో కీలక పాత్ర పోషించనుంది కాబట్టి, జట్లు కేవలం గెలవడమే కాకుండా భారీ తేడాతో విజయం సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా అట్టడుగున ఉన్న చెన్నై, కోల్‌కతా వంటి జట్లు తర్వాతి మ్యాచ్‌ల్లో పుంజుకుంటే టాప్-4 రేసు మరింత ఆసక్తికరంగా మారుతుంది. రాజస్థాన్ తన జోరును ఇలాగే కొనసాగిస్తుందా లేదా మరేదైనా జట్టు అగ్రస్థానాన్ని లాగేసుకుంటుందా అన్నది చూడాలి.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
