
BCCI vs BCB: గత ఏడాదిన్నర కాలంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ‘క్రికెట్ దౌత్యాన్ని’ ఆయుధంగా ఎంచుకుంది. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాలపై ఉన్న అడ్డంకులను తొలగించింది. ఈ నిర్ణయం ద్వారా ఇరు దేశాల మధ్య మళ్లీ క్రికెట్ సంబంధాలు బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బంగ్లాదేశ్ నూతన సమాచార, ప్రసార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ శనివారం ఈ కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ ప్రసారాలను తాము అడ్డుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా ఛానల్ లేదా బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయాలనుకుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని తెలిపారు. క్రీడలను, రాజకీయాన్ని వేర్వేరుగా చూడాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. అధికారిక ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ తమ దేశంలో మ్యాచ్‌లను చూపిస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.
గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ ఆదేశాల మేరకు విడుదల చేయడంతో పెద్ద దుమారం రేగింది. అప్పట్లో అధికారంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించి భారత్‌కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయడంతో పాటు, భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కూడా బంగ్లాదేశ్ జట్టు పాల్గొనకుండా అడ్డుకుంది. దీనివల్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారీగా నష్టపోయింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వ తాజా నిర్ణయంతో అక్కడ ఉన్న లక్షలాది మంది ఐపీఎల్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 19వ సీజన్ ప్రారంభం రోజే ఈ అనుమతి రావడం విశేషం. ఇది కేవలం ప్రసారాలకే పరిమితం కాకుండా, వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు మళ్లీ ఐపీఎల్ జట్లలో చేరడానికి మార్గం సుగమం చేస్తుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య మళ్లీ క్రికెట్ సిరీస్‌లు జరిగేలా కొత్త ప్రభుత్వం పావులు కదుపుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..