AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: IPL లో మరో కలకలం! బాంబు బెదిరింపుల్లో రాజస్థాన్ రాయల్స్ హోం గ్రౌండ్ హైఅలర్ట్‌!

ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ హోం గ్రౌండ్ అయిన జైపూర్ సవాయ్ మాన్సింగ్ స్టేడియానికి బాంబు బెదిరింపు రావడంతో భద్రత కట్టుదిట్టం అయింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌పై జరిగిన భారత వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ బెదిరింపు వచ్చినట్లు మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనకు ముందు ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలోనూ ఇలాగే బెదిరింపు జరిగింది. ఫలితంగా IPL మైదానాల్లో భద్రతా వ్యవస్థలు హైఅలర్ట్‌ లోకి వెళ్లాయి. 

IPL 2025: IPL లో మరో కలకలం! బాంబు బెదిరింపుల్లో రాజస్థాన్ రాయల్స్ హోం గ్రౌండ్ హైఅలర్ట్‌!
New Pca Stadium
Narsimha
|

Updated on: May 08, 2025 | 8:20 PM

Share

ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న సమయంలో, క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసే పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో KKR vs CSK మ్యాచ్ సందర్భంగా బాంబు బెదిరింపులు వచ్చిన ఘటన తర్వాత, ఇప్పుడు జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం కూడా అలాంటి బెదిరింపులతో దద్దరిల్లింది. ఇది రాజస్థాన్ రాయల్స్ జట్టుకు హోం గ్రౌండ్ కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మే 16న పంజాబ్ కింగ్స్‌తో తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న రాయల్స్ జట్టు తాజా పరిస్థితుల్లో తీవ్ర భద్రత మద్య మ్యాచ్ ఆడే అవకాశాలే ఉన్నాయి. ఉదయం 9:13కి వచ్చిన ఈమెయిల్‌లో భారతదేశం ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌పై చేసిన వైమానిక దాడులను ప్రస్తావిస్తూ, ఆ దాడులకు ప్రతీకారంగా స్టేడియంలో బాంబు పేల్చుతామంటూ హెచ్చరించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, స్టేడియాన్ని ఖాళీ చేసి బాంబు స్క్వాడ్లు, తనిఖీ బృందాలు రంగంలోకి దిగాయి.

రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు నీరజ్ కె పవన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ బెదిరింపులు తలెత్తిన నేపథ్యంలో “ఆపరేషన్ సిందూర్” పేరిట భారత ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వైమానిక దాడులు కేంద్రంగా నిలుస్తున్నాయి. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత భారత ప్రభుత్వం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ విజయం నేపథ్యంలో దేశం ఆనందంలో మునిగిపోయినప్పటికీ, కొన్ని శక్తులు తిరుగుబాటు చర్యలుగా ఈ రకమైన బెదిరింపులు చేస్తున్నట్లు భావిస్తున్నారు.

ఇంతలో, ఈడెన్ గార్డెన్స్‌కు కూడా ఒక రోజు ముందు జరిగిన బెదిరింపు ఘటన భద్రతా దృష్ట్యా మరింత అప్రమత్తతకు దారితీసింది. రెండు ప్రముఖ IPL వేదికలపై వరుస బెదిరింపులు రావడం వల్ల కేంద్ర, రాష్ట్ర భద్రతా ఏజెన్సీలు హైఅలర్ట్‌ లోకి వెళ్లాయి. మే 16న రాజస్థాన్ రాయల్స్ తాలూకు మ్యాచ్ యథాప్రకారం జరుగుతుందా లేక మరింత భద్రతా చర్యల తర్వాతే అనుమతిస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం అధికారికంగా మ్యాచ్ రీషెడ్యూల్ లేదా మైదానం మార్పు గురించి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే క్రికెట్ అభిమానులు, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..