
MS Dhoni on Retirement from IPL: ఐపీఎల్ 2025 సీజన్ మొదలైంది. అయితే, చెన్నై ఫ్యాన్స్‌ను మాత్రం ఓ ప్రశ్న ఎప్పటి నుంచే వేధిస్తోంది. ఈ సీజన్ తర్వాత ఎంఎస్ ధోని రిటైర్ అవుతాడా? గత 2-3 సీజన్లలో ధోని మోకాలి సమస్యలు, పదే పదే బ్యాటింగ్‌కు ఆలస్యంగా రావడం, వయస్సు పెరుగుతున్న కారణంగా ఈ ప్రశ్న నిరంతరం తలెత్తుతోంది. ఇటువంటి పరిస్థితిలో ఐపీఎల్ 2025 తర్వాత ధోనీ ఏం చేస్తాడోనని అంతా ఆలోచిస్తున్నారు. కానీ ఈలోగా, రిటైర్మెంట్ గురించి ధోని నుంచి ఒక కొత్త ప్రకటన కూడా వెలువడింది. ఇది అభిమానులకు కొంత ఉపశమనం కలిగించవచ్చు. తన శరీరం ఈ నిర్ణయం తీసుకుంటుందని, దీనికి తనకు ఇంకా 10 నెలల సమయం ఉందంటూ ధోని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2025లో ఏప్రిల్ 5వ తేదీ శనివారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా, అందరి మనస్సులో మెదిలిన ఏకైక ప్రశ్న ఇదే. ఎందుకంటే ఈ మ్యాచ్ కోసం ధోని తల్లిదండ్రులు కూడా చేపాక్ స్టేడియానికి చేరుకున్నారు. ధోని కెరీర్ మొత్తంలో అతని తల్లిదండ్రులు అతని మ్యాచ్ చూడటానికి స్టేడియానికి రావడం ఇదే మొదటిసారి. ఇటువంటి పరిస్థితిలో, ఇది అతని చివరి మ్యాచ్ కావచ్చు అనే భయం అభిమానుల మనస్సులలో నెలకొంది.
ఇది కూడా చదవండి: IPL 2025: ఇదెక్కడి చెత్త బ్యాటింగ్ సామీ.. చూడలేక నిద్రలోకి జారుకున్న చెన్నై ఆటగాడు
అయితే, అభిమానులు భయపడినట్లు జరగలేదు. ఆ మ్యాచ్ ముగిసిన ఒక రోజు తర్వాత ధోని నుంచి కీలక ప్రకటన వచ్చింది. అందులో రిటైర్మెంట్ ప్రశ్నకు ధోని సమాధానమిచ్చాడు. యూట్యూబర్ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో ధోని మాట్లాడుతూ.. తాను దీని గురించి ఆలోచించడం లేదని చెప్పుకొచ్చాడు. ‘ఇప్పుడు కాదు. నేను ఇప్పటికీ ఐపీఎల్ ఆడుతున్నాను. నాకు ఇప్పుడు 43 సంవత్సరాలు, ఈ జులైలో నాకు 44 సంవత్సరాలు వస్తాయి. 10 నెలల తర్వాత నిర్ణయం తీసుకుంటా” అని తెలిపాడు.
“నేను మరో సంవత్సరం ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నాకు 10 నెలల సమయం ఉంది. నేను ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఆడగలనా లేదా అని శరీరమే నిర్ణయిస్తుంది” అంటూ ధోని అన్నాడు.
అయితే, ఈ ప్రకటన చెన్నై-ఢిల్లీ మ్యాచ్ తర్వాత రాలేదండోయ్. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు వచ్చింది. ఈ ఇంటర్వ్యూ ధోని పేరుతో కొత్త మొబైల్ యాప్ లాంచ్ కోసం నిర్వహించారు. ఇందులో కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. రిటైర్మెంట్ పుకార్ల మధ్య, ధోని ప్రకటన అభిమానులకు కొంత ఉపశమనం కలిగించేలా ఉంది. ‘కెప్టెన్ కూల్’ కనీసం మొత్తం సీజన్ అంతా ఆడటం కనిపిస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..