IPL 2023: హిట్‌మ్యాన్ కోసం ఎదురు చూస్తున్న 6 రికార్డులు.. టోర్నీలో రాణిస్తే లెక్కలు తిరగరాయాల్సిందే..
ఐపీఎల్ సీజన్ 16లో ఆరో టైటిల్ కోసం పోరాడుతున్న ముంబై ఇండియన్స్ ఈ రోజు రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ క్రమంలో ఆర్‌సీబీపై హిట్‌మ్యాన్ రాణిస్తే కనీసం..
ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కోసం కొన్ని రికార్డులు వేచి ఉన్నాయి. అవును, ఐపీఎల్ సీజన్ 16లో ఆరో టైటిల్ కోసం పోరాడుతున్న ముంబై ఇండియన్స్ ఈ రోజు రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ క్రమంలో ఆర్‌సీబీపై హిట్‌మ్యాన్ రాణిస్తే కనీసం 2 రికార్డుల లెక్కలను తిరగరాయాల్సి వస్తుంది. అలాగే ఈ టోర్నీలో రోహిత్ శర్మ ఎదుట 6 రికార్డులు నమోదవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు క్రికెట్ అభిమానులందరి దృష్టి రోహిత్ శర్మపైనే ఉంది. టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మ్యాన్-కెప్టెన్లలో రోహిత్ ఒకడు. ఈ క్రమంలో ఆర్‌సీబీ మ్యాచ్‌లో లేదా ఐపీఎల్ 16వ సీజన్ టోర్నీలో హిట్ మ్యాన్ బద్దలు కొట్టగల రికార్డులేమిటో ఇప్పుడు చూద్దాం..
6000 పరుగులు: రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 6,000 పరుగుల మార్క్‌ను చేరుకోవడానికి కేవలం 121 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు అంటే గడిచిన 15 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లి(6,624), శిఖర్ ధావన్(6,244) మినహా మరే ఇతర ఆటగాడు ఈ ఘనతను అందుకోలేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 16లో రోహిత్ శర్మ(5,879)తో పాటు డేవిడ్ వార్నర్(5,881) కూడా ఈ మైల్ స్టోన్‌పై కన్నేశాడు. మరోవైపు ఐపీఎల్ ఆడుతున్న మరే ఇతర ఆటగాడు కూడా 5 వేలు లేదా లేదా అంతకంటే ఎక్కువ ఐపీఎల్ పరుగులను చేరుకోలేకపోయారు.
ఒకే ఫ్రాంచైజీకి 5000 పరుగులు: 2011లో ముంబై ఇండియన్స్‌లో చేరిన దగ్గర నుంచి.. రోహిత్ శర్మ ఈ ఫ్రాంచైజీ కోసం 182 మ్యాచ్‌లలో 30.18 సగటుతో 4,709 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ తరఫున 5000 పరుగుల ఫిగర్‌ను చేరుకోవడానికి రోహిత్‌కు ఇంకా 291 పరుగులు అవసరం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు కోహ్లీ (6,624) తన ఫ్రాంచైజీకి 5,000 లేదా అంతకంటే ఎక్కువ IPL పరుగులు చేసిన ఏకైక ఆటగాడు. ఐపీఎల్ ప్రారంభ కాలంలో డెక్కన్ ఛార్జర్స్ తరపున రోహిత్ శర్మ మూడు సీజన్లు ఆడిన సంగతి తెలిసిందే.
కెప్టెన్‌గా 150 ఐపీఎల్ మ్యాచ్‌లు: కెప్టెన్‌గా 150 ఐపీఎల్ మ్యాచ్‌లు పూర్తి చేయడానికి రోహిత్ శర్మ మరో ఏడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన మహేంద్ర సింగ్ ధోని (210) ప్రస్తుతం ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్. రోహిత్ ఇప్పటివరకు 143 మ్యాచ్‌లలో(సూపర్ ఓవర్ విజయాలు మినహా) ముంబై ఇండియన్స్‌కు 79 విజయాలు అందించాడు. 56.64 విన్నింగ్ పర్సంటేజ్‌తో దుమ్మురేపాడు.
T20 క్రికెట్‌లో 11,000 పరుగులు: ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ 407 మ్యాచ్‌లలో 31.0 సగటు.. 133.55 స్ట్రైక్ రేట్‌తో 10,703 పరుగులు చేశాడు. కోహ్లి (11,326) తర్వాత 11,000 టీ20 పరుగులు మైల్ స్టోన్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు రోహిత్. హిట్‌మ్యాన్ మరో 297 పరుగులు చేస్తే 11 వేల పరుగుల మైల్ స్టోన్ అందుకుంటాడు. టీ20 పరుగుల పరంగా రోహిత్ శర్మ కంటే ముందు క్రిస్ గేల్ (14,562), కీరన్ పొలార్డ్ (12,528), షోయబ్ మాలిక్ (12,175), ఆరోన్ ఫించ్ (11,392), డేవిడ్ వార్నర్ (11,179), అలెక్స్ హేల్స్ (10,916) ముందున్నారు.
100 క్యాచులు: గొప్ప బ్యాట్స్‌మన్, కెప్టెన్‌గానే కాకుండా.. రోహిత్ శర్మ అద్భుతమైన ఫీల్డర్ కూడా. ఇప్పటివరకు జరిగిన 15 సీజన్లలో రోహిత్ శర్మ 97 ఐపీఎల్ క్యాచులు పట్టాడు. 100 క్యాచ్‌ల ఫిగర్‌ను అందుకోవడానికి రోహిత్‌కు మరో 3 క్యాచ్‌లు కావాలి. ప్రస్తుతం ఈ ఘనత సాధించిన ఆటగాళ్లలో సురేశ్ రైనా (109), కీరన్ పొలార్డ్ (103) మాత్రమే ఉన్నారు. రోహిత్ తర్వాత కోహ్లీ (93), ధావన్ (92) కూడా ఈ ఘనత సాధించేందుకు రేసులో ఉన్నారు.
ఐపీఎల్ 6వ టైటిట్: ముంబై ఇండియన్స్‌ని రోహిత్ శర్మ 2013, 2015, 2017, 2019, 2020 ఐపీల్ సీజన్లలో టోర్నీ విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఐపీఎల్ 2023లో కూడా రోహిత్ శర్మ టైటిల్ గెలిస్తే హిట్ మ్యాన్ ఖాతాలోకి 6వ టైటిల్ చేరుతుంది. ఇప్పటివరకు రోహిత్ మాత్రమే 5 ఐపీఎల్ టోర్నీలు గెలిచిన కెప్టెన్. రోహిత్ తర్వాత ఎంఎస్ ధోని(చెన్నై సూపర్ కింగ్స్) 4 ఐపీఎల్ ట్రోఫీలతో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, ఐపీఎల్ 2009 టోర్నీ విజేత అయిన డెక్కన్ చార్జర్స్ టీమ్‌లో రోహిత్ కూడా సభ్యుడు. అలా ఆటగాడిగా ఇప్పటి వరకు 6 ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్నాడు. ముంబై తరఫున హ్యాట్రిక్ టైటిల్స్ నెగ్గిన ఏకైక ఆటగాడు రోహిత్.