IND vs ENG 5th Test: ధర్మశాలలో నయా ‘సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్‌’గా జైస్వాల్.. ఆ స్పెషల్ రికార్డ్ చూస్తే దిగ్గజాలకే వణుకు పుట్టాల్సిందే..

Yashasvi Jaiswal Record: భారత స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ మరో భారీ బ్యాటింగ్ మైలురాయిని సాధించే దిశగా దూసుకుపోతున్నాడు. స్వదేశంలో తొలి టెస్టు సిరీస్‌ ఆడుతున్న 22 ఏళ్ల క్రికెటర్‌.. ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్టుల్లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఐదో టెస్టులోనూ మరో రికార్డును చేరేందుకు సిద్ధమయ్యాడు. ఐదో టెస్టు గురువారం (మార్చి 7) ధర్మశాలలో ప్రారంభం కానుంది.

IND vs ENG 5th Test: ధర్మశాలలో నయా సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్‌గా జైస్వాల్.. ఆ స్పెషల్ రికార్డ్ చూస్తే దిగ్గజాలకే వణుకు పుట్టాల్సిందే..
Jaiswal

Updated on: Mar 01, 2024 | 1:30 PM

Yashasvi Jaiswal Record: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ చెలరేగుతున్నాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్టుల్లో 93.57 సగటుతో 655 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. స్వదేశంలో తొలి టెస్టు సిరీస్‌ ఆడుతున్న 22 ఏళ్ల క్రికెటర్‌.. ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్టుల్లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఐదో టెస్టులోనూ మరో రికార్డును చేరేందుకు సిద్ధమయ్యాడు. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు గురువారం (మార్చి 7) ధర్మశాలలో ప్రారంభం కానుంది.

ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో జైస్వాల్ 29 పరుగులు చేయగలిగితే, టెస్టు చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కనున్నాడు. ప్రస్తుతం, చెతేశ్వర్ పుజారా పేరిట ఈ రికార్డు ఉంది. అతను ఈ మైలురాయిని చేరుకోవడానికి 11 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అయితే, ఇన్నింగ్స్ పరంగా ఈ రికార్డు వినోద్ కాంబ్లీ పేరిట ఉంది. ఈ మాజీ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 12 మ్యాచ్‌ల్లో 14 ఇన్నింగ్స్‌ల్లో టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు.

8 టెస్టులు.. 15 ఇన్నింగ్స్‌ల్లో 971 పరుగులు..

జైస్వాల్ ఎనిమిది టెస్టుల్లో 15 ఇన్నింగ్స్‌ల్లో 971 పరుగులు చేశాడు. లెజెండరీ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్ ఏడు మ్యాచ్‌ల్లో 1000 టెస్టు పరుగులు పూర్తి చేశాడు. మిగతా ముగ్గురు బ్యాట్స్‌మెన్ – ఇంగ్లండ్‌కు చెందిన హెర్బర్ట్ సట్‌క్లిఫ్, ఎవర్టన్ వీక్స్, జార్జ్ హెడ్లీ ఈ ఫీట్ సాధించడానికి తొమ్మిది టెస్టులు ఆడారు. ఐదో టెస్టులో జైస్వాల్ 1000 పరుగుల మార్క్‌ను చేరుకోగలిగితే, టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా చరిత్రలో సంయుక్తంగా రెండో స్థానంలో నిలుస్తాడు.

ఇంకా, జైస్వాల్ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్‌లో 700 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన చరిత్రలో మొదటి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా, ఓవరాల్‌గా మూడవ బ్యాట్స్‌మెన్‌గా అవతరించే అవకాశం ఉంది. ప్రస్తుతం, 1990లో ఇంగ్లండ్‌లో ఆడిన సిరీస్‌లో మొత్తం 752 పరుగులు చేసిన గ్రాహం గూచ్ భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును బద్దలు కొట్టాలంటే జైస్వాల్ 98 పరుగులు చేయాల్సి ఉంది.

ఐదో టెస్టుకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ఆర్ అశ్విన్ , రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..