AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG : ముల్లన్‌పూర్‌లో టీమిండియా గర్జన.. ఇన్నింగ్స్, 300 పరుగుల తేడాతో ఆఫ్ఘన్ పై భారీ విజయం

IND vs AFG : ముల్లన్‌ పూర్‌లో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌ లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్‌పై ఇన్నింగ్స్, 300 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించి తిరుగులేని పట్టు సాధించింది.

IND vs AFG : ముల్లన్‌పూర్‌లో టీమిండియా గర్జన.. ఇన్నింగ్స్, 300 పరుగుల తేడాతో ఆఫ్ఘన్ పై భారీ విజయం
Ind Vs Afg
Rakesh
|

Updated on: Jun 08, 2026 | 3:30 PM

Share

IND vs AFG : భారత పర్యటనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ జట్టుకు టీమిండియా గట్టి షాక్ ఇచ్చింది. చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ముల్లన్‌పూర్) వేదికగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత్ రికార్డు స్థాయి విజయాన్ని అందుకుంది. పర్యాటక జట్టుపై ఇన్నింగ్స్, 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఏకైక టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. జూన్ 6న ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించి తిరుగులేని పట్టు సాధించింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (24 రన్స్) రూపంలో తొందరగానే వికెట్ పడినా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఆఫ్ఘన్ బౌలర్లను ఆటాడుకున్నారు. కేఎల్ రాహుల్ క్లాసిక్ సెంచరీ (100 రన్స్)తో కదంతొక్కగా, సాయి సుదర్శన్ (81 రన్స్) అతనికి మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత సూపర్‌ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ లీడ్‌ తీసుకుని 126 పరుగులతో సెంచరీ బాదాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ (81 రన్స్), వాషింగ్టన్ సుందర్ (52 రన్స్) కూడా హాఫ్ సెంచరీలతో మెరవడంతో భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 568 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

భారీ లక్ష్యంతో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్‌తో ఆఫ్ఘన్ బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ పతనాన్ని శాసించాడు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు. ఆఫ్ఘన్ జట్టులో రహ్మత్ షా (60 రన్స్) ఒక్కడే కాస్త ఒంటరి పోరాటం చేయడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులకే ఆలౌట్ అయింది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే 412 పరుగులు వెనుకబడి ఉండటంతో టీమిండియా కెప్టెన్ ఆఫ్ఘనిస్తాన్‌కు ఫాలో-ఆన్ ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘన్ జట్టుకు ఓపెనర్ సిద్ధిఖుల్లా అటల్ (42 రన్స్) మంచి ఆరంభాన్ని ఇచ్చినా, ఆ తర్వాత వచ్చిన మిగతా బ్యాటర్లు భారత స్పిన్ దాడికి పేకమేడలా కూలిపోయారు. ఈ ఇన్నింగ్స్‌లో సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో, వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లతో చెలరేగిపోయారు. మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.

భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 35.5 ఓవర్లు మాత్రమే తట్టుకుని 112 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల తేడాతో బంపర్ విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌ను కేవలం మూడు రోజుల్లోనే ముగించిన టీమిండియా.. ఇదే జోష్‌ను త్వరలో జరగబోయే వన్డే సిరీస్‌లోనూ కొనసాగించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత యువ స్పిన్నర్ల ప్రదర్శన భవిష్యత్తు టెస్ట్ క్రికెట్‌కు మంచి సంకేతమని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us