AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Semifinal Scenario: బంగ్లాదేశ్‌పై గెలుపు.. టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే ఇంత జరగాలా..?

బంగ్లాదేశ్‌పై సాధించిన ఘన విజయం భారత జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే సెమీఫైనల్ చేరాలంటే రాబోయే ఆస్ట్రేలియా మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. మన మహిళా సింహాలు ఆసీస్ సవాలును సైతం అధిగమించి నేరుగా సెమీఫైనల్లో అడుగుపెట్టాలని దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు బలంగా ఆకాంక్షిస్తున్నారు.

India Semifinal Scenario: బంగ్లాదేశ్‌పై గెలుపు.. టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే ఇంత జరగాలా..?
India Semifinal Scenario
Venkata Chari
|

Updated on: Jun 26, 2026 | 6:30 AM

Share

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై లభించిన అద్భుత విజయం భారత మహిళల సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఈ గెలుపుతో గ్రూప్-ఎ పట్టికలో రెండో స్థానాన్ని మరింత సుస్థిరపరుచుకుంది. అయితే సెమీస్ చేరడానికి భారత్ ముందున్న అసలు సిసలైన సమీకరణాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

చావో రేవో పోరులో సత్తా చాటిన భారత మహిళలు..

ఈ మ్యాచ్‌కు ముందు భారత్, బంగ్లాదేశ్ రెండు జట్లు కూడా మూడు మ్యాచ్‌ల్లో నాలుగేసి పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పని పరిస్థితి. ఇటువంటి ఒత్తిడి సమయంలో భారత మహిళల జట్టు అన్ని విభాగాల్లోనూ అసాధారణ ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను పూర్తిగా ముంచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను రాధా యాదవ్, శ్రీచరణి తమ స్పిన్ మాయాజాలంతో తిప్పేసి ఐదు వికెట్లు పడగొట్టి 136 పరుగులకే పరిమితం చేశారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఓపెనర్ షఫాలీ వర్మ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో, భారత్ మరో 19 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

సెమీఫైనల్ చేరడానికి మొదటి సమీకరణం: ఆస్ట్రేలియాపై విజయం సాధిస్తే..

గ్రూప్ దశలో భారత్‌కు ఇప్పుడు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. ఆదివారం జరగబోయే ఈ అత్యంత కీలక పోరులో భారత్ బలిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే మొత్తం 8 పాయింట్లతో నిలుస్తుంది.

దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ ఓడిపోతే: ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా కూడా 3 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లతో ఉంది. వారు తమ తదుపరి మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. భారత్ నెట్ రన్ రేట్ (+3.00) దక్షిణాఫ్రికా (-0.546) కంటే చాలా మెరుగ్గా ఉంది. కాబట్టి ఆఫ్రికా జట్టు తన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒకదానిలో ఓడిపోతే, భారత్ ఆస్ట్రేలియాతో కలిసి చెరో 8 పాయింట్లతో సులభంగా సెమీఫైనల్ చేరుకుంటుంది.

దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌లూ గెలిస్తే: ఒకవేళ దక్షిణాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే.. అప్పుడు ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా మూడు జట్లూ తలా 8 పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. అప్పుడు ఏ రెండు జట్ల నెట్ రన్ రేట్ అత్యుత్తమంగా ఉంటుందో ఆ జట్లే సెమీస్ బెర్త్ దక్కించుకుంటాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా అత్యధికంగా +4.745 రన్ రేట్ కలిగి ఉంది.

రెండో సమీకరణం: ఆస్ట్రేలియా చేతిలో ఓటమి ఎదురైతే..

ఒకవేళ దురదృష్టవశాత్తూ ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే, ఆస్ట్రేలియా 10 పాయింట్లతో నేరుగా సెమీస్‌కు వెళ్తుంది. భారత్ 6 పాయింట్లతోనే నిలిచిపోతుంది. అప్పుడు భారత్ సెమీస్ చేరాలంటే నెదర్లాండ్స్ లేదా బంగ్లాదేశ్ జట్లలో ఎవరో ఒకరు దక్షిణాఫ్రికాను ఓడించాలి. అప్పుడు ఆఫ్రికా కూడా 6 పాయింట్ల వద్దే ఆగిపోతుంది కాబట్టి, మెరుగైన రన్ రేట్ ఆధారంగా భారత్ రెండో స్థానంతో సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా తన చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే భారత్‌కు ఎలాంటి డోకా లేకుండా సెమీస్ టికెట్ లభిస్తుంది.

Follow Us