IND vs AUS: హాట్‌కేకుల్లా అమ్ముడైన భారత్ వర్సెస్ ఆసీస్ వన్డే సిరీస్ టిక్కెట్లు! ఎందుకంత డిమాండ్ అంటే..
అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. కోహ్లీ, రోహిత్ శర్మల తిరిగి రాకతో డిమాండ్ పెరిగింది. సిడ్నీ, కాన్బెర్రా మ్యాచ్‌లకు పబ్లిక్ టిక్కెట్లు కూడా ముందుగానే బుక్ అయ్యాయి. పెర్త్, అడిలైడ్, సిడ్నీలో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి.

అక్టోబర్ 19 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు ఇంకా 50 రోజులపైనే సమయం ఉన్నా.. అప్పుడే ఈ సిరీస్‌కు సంబంధించి భారతీయ జోన్ టిక్కెట్లు అమ్ముడైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. సిడ్నీ, కాన్బెర్రా మ్యాచ్‌లకు పబ్లిక్ టిక్కెట్లు కూడా ముందుగానే బుక్ చేసుకున్నాయని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అక్టోబర్ 19న పెర్త్‌లో జరిగే తొలి వన్డేతో ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. “ఎనిమిది వేదికలలోని భారతీయ అభిమానుల జోన్లకు టిక్కెట్లు అమ్ముడుపోవడం పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం” అని క్రికెట్ ఆస్ట్రేలియా ఈవెంట్స్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ జోయెల్ మోరిసన్ ఒక ప్రకటనలో తెలిపారు.
“ఈ సిరీస్ చుట్టూ పెరుగుతున్న ఊపును, ఆట పట్ల అభిమానులు ప్రదర్శించే బలమైన అభిరుచిని చూడటానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. రెండు పెద్ద క్రికెట్ దేశాల మధ్య మైదానంలో ప్రపంచ స్థాయి పోటీ, స్టాండ్స్‌లో ఉత్సాహభరితమైన వాతావరణం కోసం మేం ఎదురు చూస్తున్నాం” అని ఆయన అన్నారు. అయితే ఈ వన్డే సిరీస్ అంత డిమాండ్ ఉండేందుకు కారణం.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత తిరిగి మైదానంలోకి దిగడమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీ20, టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోహ్లీ, రోహిత్ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ జంట మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. తిరిగి ఆసీస్‌తో సిరీస్‌తో క్రీజ్‌లోకి దిగనున్నారు. అందుకే అభిమానులు వీరి ఆట చూసేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఇక వన్డే సిరీస్ మ్యాచ్‌ల వివరాలకు వస్తే.. అక్టోబర్ 19 ఆదివారం పెర్త్ స్టేడియం వేదిక తొలి వన్డే జరగనుంది. అక్టోబర్ 23 గురువారం అడిలైడ్ ఓవల్ వేదికగా రెండో వన్డే, అక్టోబర్ 25 శనివారం SCG సిడ్నీ వేదికగా మూడో వన్డే జరగనుంది. టీ20 సిరీస్‌లో భాగంగా.. అక్టోబర్ 29, అక్టోబర్ 31, నవంబర్ 2, నవంబర్ 6, నవంబర్ 8న ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




