IND vs ZIM T20I : ఇంగ్లాండ్, ఐర్లాండ్ షాకుల నుంచి కోలుకున్న టీమిండియా.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
IND vs ZIM T20I : ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్ పరాజయాల తర్వాత జింబాబ్వేపై గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కొత్త వ్యూహాలతో సిద్ధమవుతుండగా, వైభవ్ సూర్యవంశీ తిరిగి ఓపెనర్‌గా అవకాశం దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

IND vs ZIM T20I : భారత్, జింబాబ్వే జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లోని మొదటి సమరం నేడు (గురువారం) హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. గతంలో ఐర్లాండ్‌తో 0-2, ఇంగ్లాండ్‌తో 0-4 తేడాతో సిరీస్‌లను కోల్పోయి క్లీన్‌స్వీప్ పరాభవాలు చవిచూసిన టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. కాగా పొట్టి ఫార్మాట్‌లో భారత్‌పై జింబాబ్వేకు గతంలో మూడుసార్లు గెలిచిన రికార్డు ఉంది. ఈ క్రమంలో తాత్కాలిక హెడ్ కోచ్ వివిఎస్ లక్ష్మణ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో భారత్ సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది.
ఓపెనింగ్‌లోకి వైభవ్ సూర్యవంశీ కమ్‌బ్యాక్
మునుపటి సిరీస్‌లో వరుసగా మూడు అవకాశాలు వచ్చి విఫలమవడంతో పక్కనబెట్టిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తిరిగి ఈ మ్యాచ్‌తో తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. సంజూ శాంసన్ అందుబాటులో లేకపోవడంతో అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ మూడో స్థానంలో రానుండగా, నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ బరిలోకి దిగనున్నారు. గత కొన్ని మ్యాచ్‌లుగా తిలక్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, వైస్ కెప్టెన్ కావడంతో ఆయన వైఫల్యాలు టీమ్ మేనేజ్‌మెంట్‌కు కాస్త తలనొప్పిగా మారాయి.
ఆల్‌రౌండర్లు, మిడిల్ ఆర్డర్ కలవరం
భారత జట్టును తీవ్రంగా కలవరపెడుతున్న అంశం ఆల్‌రౌండర్ల ఎంపిక. శివమ్ దూబే, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గేలలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. శివమ్ దూబే ఇటీవలి కాలంలో స్వింగ్, సీమ్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఫామ్ లేమితో సతమతమవుతున్నప్పటికీ, అనుభవం దృష్ట్యా ఆయనకే ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. అలాగే ఫినిషర్ పాత్రలో రింకూ సింగ్ రాణించాల్సి ఉంది.
హరారే పిచ్ తీరు, బౌలింగ్ కాంబినేషన్
హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్‌పై తేమతో పాటు మంచి బౌన్స్ ఉండే అవకాశం ఉంది. ఇది వేగవంతమైన బౌలర్లకు బాగా అనుకూలిస్తుంది. జింబాబ్వే పేసర్లు బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ ఎన్గారావాల నుంచి భారత బ్యాటర్లకు కఠిన సవాలు ఎదురుకానుంది. దీనిని ఎదుర్కొనేందుకు భారత్ 3 పేసర్లు, 1 స్పిన్నర్, 2 ఆల్‌రౌండర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. పేస్ విభాగంలో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ ఆడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్ బాధ్యతలను రవి బిష్ణోయ్ మోయనున్నారు.
భారత్ తుది జట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, శివమ్ దూబే, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, అశోక్ శర్మ.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
