IND vs SL: వామ్మో.. నేను బౌలర్‌ అయ్యుంటేనా? మిస్టర్‌ 360 కళ్లు చెదిరే షాట్లపై కెప్టెన్‌ హార్దిక్ కామెంట్స్‌ వైరల్‌

|

Jan 08, 2023 | 12:55 PM

కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన సూర్య.. ఒకదాని తర్వాత ఒకటి వైవిధ్యమైన షాట్లు కొడుతూ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాడు. సూర్య 360 డిగ్రీల ఆటకు అవాక్కయిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా విజయం తర్వాత సూర్యపై ప్రశంసలు కురిపించాడు.

IND vs SL: వామ్మో.. నేను బౌలర్‌ అయ్యుంటేనా? మిస్టర్‌ 360 కళ్లు చెదిరే షాట్లపై కెప్టెన్‌ హార్దిక్ కామెంట్స్‌ వైరల్‌
Team India
Follow us on

భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు సూర్యకుమార్‌ యాదవ్‌. తన పేరుకు తగ్గట్టుగానే 360 డిగ్రీల ఆటతో కళ్లు చెదిరే షాట్లు ఆడాడు సూర్య. మొత్తం 51 బంతుల్లో అజేయంగా 112 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన సూర్య.. ఒకదాని తర్వాత ఒకటి వైవిధ్యమైన షాట్లు కొడుతూ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాడు. సూర్య 360 డిగ్రీల ఆటకు అవాక్కయిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా విజయం తర్వాత సూర్యపై ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో పాండ్యా మాట్లాడుతూ, ‘సూర్య అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతని ఆట, బ్యాటింగ్ చూస్తుంటే చాలా తేలికగా అనిపిస్తుంది. కళ్లు బైర్లు గమ్మే షాట్లతో విరుచుకుపడే సూర్య ధాటికి నేను బౌలర్‌గా ఉండి ఉంటే కచ్చితంగా నిరుత్సాహపడేవాడిని. సూర్యకుమార్ యాదవ్‌కు ప్రత్యేకంగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను కఠిన పరిస్థితుల్లో ఉండి ఇబ్బంది పడుతుంటే ఓ పరిష్కారం చెబుతాం. తరుచుగా తన సొంత ప్రణాళికతోనే బరిలోకి దిగుతాడు’ అని చెప్పుకొచ్చాడు పాండ్యా.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్‌లో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. సూర్యతో పాటు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 46 పరుగులు, రాహుల్ త్రిపాఠి 16 బంతుల్లో 35 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ కూడా 9 బంతుల్లో 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంకేయులను భారత బౌలర్లు 16.4 ఓవర్లలోనే 137 పరుగులకే ఆలౌట్‌ చేశారు. దీంతో 91 పరుగుల తేడాతో మ్యాచ్‌తో పాటు 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్ తలో 2 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీయగా, అక్షర్ ఈ మొత్తం సిరీస్‌లో మొత్తం 117 పరుగులు చేసి 3 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. సెంచరీతో ఆకట్టుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..