కివీస్ బౌలర్ల గుండెల్లో రైళ్లు.. టీమిండియా ప్లేయింగ్ 11లోకి బ్రేకుల్లేని బుల్డోజర్ ఎంట్రీ..?
Team India playing XI: న్యూజిలాండ్‌తో రెండో టీ20కి టీం ఇండియా సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్‌లో గాయపడిన ఇషాన్ కిషన్ దూరం కాగా, అతని స్థానంలో యువ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కనుంది. సంజు శాంసన్ వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ లోనూ ఒక మార్పు ఉండే అవకాశం ఉంది.

Team India playing XI: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీం ఇండియా అద్భుతమైన బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీం ఇండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో దూసుకువెళ్లింది. ఇప్పుడు సిరీస్‌ను కైవసం చేసుకునే దిశగా మరో ముందడుగు వేయడానికి టీం ఇండియా రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ కూడా తొలి మ్యాచ్ జరిగిన క్రైస్ట్‌చర్చ్‌లోని అదే మైదానంలో జరగనుంది.
అయితే, ఈ కీలక పోరుకు ముందు టీం ఇండియాకు ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ ఎదురయ్యాయి. వికెట్ కీపర్ కం బ్యాటర్ ఇషాన్ కిషన్ కుడి తొడ కండరాల గాయం కారణంగా రెండో టీ20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో ఇషాన్ గాయానికి గురైనట్లు బీసీసీఐ ధృవీకరించింది. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం ఇషాన్ కిషన్ కోలుకునే ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తుంది. సిరీస్‌లో భాగంగా ఈరోజు జరిగే రెండో టీ20లో అతడు అందుబాటులో ఉండడని బీసీసీఐ స్పష్టం చేసింది.
దీంతో ఇషాన్ కిషన్ స్థానంలో 15 ఏళ్ల యువ డైనమెట్ వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైపోయింది. వైభవ్ రాకతో ఓపెనింగ్ జోడిలో మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుండగా, ఇషాన్ కిషన్ స్థానంలో సంజు శాంసన్ వన్ డౌన్ లో బ్యాటింగ్‌కు రానున్నాడు. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, సంజు శాంసన్, అభిషేక్ శర్మ నిలకడగా రాణిస్తున్న నేపథ్యంలో గతంలో అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. వరుసగా ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ సిరీస్‌లలో వైభవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. కానీ ఇప్పుడు ఇషాన్ కిషన్ గాయపడడంతో తుది జట్టులోకి వచ్చేందుకు వైభవ్ సూర్యవంశీకి మార్గం సుగమమైంది. ఇప్పటికే 15 ఏళ్ల వైభవ్‌కు కివీస్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం ఉంది. ఐపీఎల్‌లో మ్యాట్ హెన్రీ, ఫెర్గుసన్ వంటి బౌలర్లను అతను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు వారి సొంత గడ్డపై కూడా తన సత్తా చాటాలని వైభవ్ ఉవ్విళ్లూరుతున్నాడు.
అదేవిధంగా, ఫాస్ట్ బౌలింగ్ విభాగంలోనూ ఒక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. మయాంక్ యాదవ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ ను తీసుకున్నట్లు సమాచారం. తొలి టీ20లో మయాంక్ యాదవ్ ఒక వికెట్ తీసినప్పటికీ, తన నాలుగు ఓవర్ల కోటాలో 40 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, మయాంక్ యాదవ్‌ను తప్పిస్తారా అనే దానిపై మాత్రం ఇంకా పూర్తి స్పష్టత లేదు.
తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుని 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు మరింత దగ్గరవ్వాలని చూస్తుంది. మరోవైపు, న్యూజిలాండ్ సైతం తొలి టీ20 ఓటమికి బదులు తీర్చుకొని సిరీస్‌ను 1-1తో సమంగా ఉంచే ఉద్దేశంతో పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగే అవకాశం ఉంది. బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న ఈ పిచ్‌పై మరోసారి బ్యాటర్లు చెలరేగిపోయే అవకాశం ఉంది.
టీం ఇండియా తుది జట్టు అంచనా: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, నమందీర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, మయంక్ యాదవ్ లేదా ప్రిన్స్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
