IND vs ENG 4th T20I : తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్ కంబ్యాక్? ప్లేయింగ్ ఎలెవన్‌పై అభిమానుల్లో పెరిగిన ఉత్కంఠ
IND vs ENG 4th T20I : బ్రిస్టల్‌లో జరిగే నాలుగో టీ20లో సంజూ శాంసన్ మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిలక్ వర్మ పేలవ ఫామ్ నేపథ్యంలో భారత జట్టులో మార్పులు జరిగే అవకాశంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

IND vs ENG 4th T20I : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నాలుగో ముఖాముఖి పోరుకు బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదిక కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 2-0 ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో, గురువారం జరిగే ఈ మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. ఐర్లాండ్ పర్యటనలో క్లీన్ స్వీప్ పరాభవాన్ని మూటగట్టుకున్న శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా, ఈ పర్యటనలో కూడా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో, మూడో టీ20లో ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో భారత్ ఓడిపోయింది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో, ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే ఇంగ్లాండ్ ఇక్కడే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
ప్రస్తుతం క్రికెట్ అభిమానులు, టెక్నికల్ విశ్లేషకుల మధ్య ఒకే ఒక అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. అదే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి పక్కన పెట్టడం. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ విజేతగా నిలవడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ పర్యటనలో అతని స్థానంలో యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకున్నారు. గత మూడో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ లైనప్ ఘోరంగా విఫలమై కేవలం 76 పరుగులకే కుప్పకూలిపోవడంతో, మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయడానికి సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ బాగా పెరిగింది. ఫామ్‌లో లేని వైస్ కెప్టెన్ తిలక్ వర్మ స్థానంలో సంజూను బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
భారత జట్టు వరుస ఓటములపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మ్యాచ్ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటను సరైన రీతిలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని, ఐర్లాండ్ పర్యటన నుంచి మన జట్టు ఆ విషయంలో పూర్తిగా విఫలమవుతోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. “నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయినంత మాత్రాన ఒక జట్టు చెడ్డ జట్టు అయిపోదు. కొన్నిసార్లు ప్రత్యర్థి జట్టు మనకంటే అద్భుతంగా ఆడుతుంది. మరికొన్నిసార్లు మనం పిచ్, అక్కడి వాతావరణ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోతాం. మ్యాచ్ గమనాన్ని, పరిస్థితులను రీడ్ చేయడం అనేది ఆటలో చాలా ముఖ్యం. ఐర్లాండ్ సిరీస్ నుంచి మనం ఆ పని చేయలేకపోతున్నాం” అని గంభీర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
నాలుగో టీ20లో ఇరు జట్ల అంచనా తుది జట్టు ఇవే
ఈ కీలక పోరులో హోస్ట్ టీమ్ అయిన ఇంగ్లాండ్ తన విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చే ప్రసక్తే లేదని తెలుస్తోంది. హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్ జట్టు అదే పవర్‌ఫుల్ లైన్అప్‌తో బరిలోకి దిగుతోంది. అయితే భారత జట్టులో మాత్రం మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. లీకైన సమాచారం ప్రకారం ఇరు జట్ల అంచనా తుది జట్టు వివరాలు ఇవే
భారత అంచనా తుది జట్టు : అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఈషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ/సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ అంచనా తుది జట్టు : ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
