AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Korean Kanakaraju Review: కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?

గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలు లేక సతమతమవుతున్న వరుణ్ తేజ్ ఈసారి తన పంథా మార్చుకున్నాడు. యాక్షన్, కుటుంబ కథా చిత్రాలు, క్రీడా నేపథ్యం ఉన్న ప్రయోగాలు పక్కనపెట్టి పూర్తి స్థాయి హాస్యంతో ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేశాడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. థియేటర్లలోకి వచ్చిన ఈ విభిన్న ప్రయోగం ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో, హీరోకి ఆశించిన విజయాన్ని అందించిందో లేదో ఇప్పుడు చూద్దాం.

Korean Kanakaraju Review: కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
Korean Kanakaraju Movie Review
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 07, 2026 | 8:00 AM

Share

మూవీ రివ్యూ: కొరియన్ కనకరాజు

నటీనటులు: వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్, మురళీధర్ గౌడ్, మాస్టర్ రేవంత్, వీటీవీ గణేష్ తదితరులు

సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి

సంగీతం: తమన్

ఎడిటింగ్: సత్య జి

నిర్మాతలు: యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మేర్లపాక గాంధీ

కథ:

అనంతపురం జిల్లాలోని పెనుగొండ ప్రాంతంలో చెక్కభజనలు చేసుకుంటూ జీవించే యువకుడు కనకరాజు (వరుణ్ తేజ్). ఆ ఊళ్లో అతనంటే అందరికీ కొద్దిగా భయం. అతనికి ఎప్పుడూ అండగా నిలబడే స్నేహితుడు, ఫోటోగ్రాఫర్ కిష్టప్ప (సత్య). ఇలా సాదాసీదాగా సాగిపోతున్న కనకరాజు జీవితంలోకి కియా కార్ల కంపెనీలో పనిచేసే చైత్ర (రీతికా నాయక్) వస్తుంది. చైత్రకు కొరియా, అక్కడి సినిమాలు, సంస్కృతి అంటే అమితమైన ఆసక్తి. భవిష్యత్తులో అక్కడికే వెళ్లి స్థిరపడాలని కలలు కంటుంటుంది. ఆమెను ఎలాగైనా తన ప్రేమలో దించాలనే ఉద్దేశ్యంతో కనకరాజు ఆమె వెంటే తిరుగుతుంటాడు. ఇదే క్రమంలో స్థానికంగా ఉండే ప్రత్యర్థి చెంగల్ రెడ్డి (సునీల్)తో హీరోకి పెద్ద గొడవ జరుగుతుంది. ఒకసారి మద్యం దుకాణంలో వాళ్లతో ఘర్షణ పడుతున్న సమయంలో అనుకోకుండా ఒక పాత సీసా పగిలిపోతుంది. అందులో బంధీగా ఉన్న ఒక కొరియా గ్యాంగ్ స్టర్ ఆత్మ ఉంటుంది. అది కాస్తా మద్యం ద్వారా కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. విదేశీ ఆత్మ దేహంలోకి వెళ్ళాక ఆ పల్లెటూరి యువకుడి ప్రవర్తన ఎలా మారింది? అసలు ఆ ఆత్మకు ఉన్న కోరిక ఏమిటి? ఆ తరువాత వీళ్లంతా కలిసి కొరియా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేదే మిగతా చిత్రం.

కథనం:

దెయ్యాలు, ఆత్మలు తదితర అంశాల నేపథ్యంలో భయపెడుతూనే నవ్వించే చిత్రాలు తెలుగు తెరకు కొత్త కాదు. ఒకరి దేహంలోకి మరొకరి ఆత్మ ప్రవేశించడం కూడా మనం చాలాసార్లు చూసిందే. కానీ ఇక్కడ దర్శకుడు ఎంచుకున్న విదేశీ ఆత్మ అనే పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. సినిమా మొదలైన చాలాసేపటి వరకు కథనం చాలా సాదాసీదాగా సాగుతుంది. హీరో అల్లరి పనులు, పల్లెటూరి వాతావరణం, హీరోయిన్ వెంట పడటం, విలన్ తో గొడవలు ఇవన్నీ పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఈ భాగంలో వచ్చే హాస్యం కూడా అంతగా పండలేదు. ప్రేక్షకుడు కాస్త బోర్ ఫీలయ్యే సమయంలో ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ సినిమా స్వరూపాన్నే మార్చేస్తుంది. ఎప్పుడైతే హీరో శరీరంలోకి ఆత్మ వస్తుందో అక్కడి నుంచి కథ ఊపు అందుకుంటుంది. సెకండాఫ్ మొత్తం కొరియాలో సాగుతుంది.

లాజిక్ లను పూర్తిగా పక్కనపెట్టి కేవలం నవ్వించడమే లక్ష్యంగా దర్శకుడు అడుగులు వేశాడు. ముఖ్యంగా స్నేహితుడి పాత్రలో సత్య చేసే హడావిడి, ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ అంతా ఇంతా కాదు. ఆత్మను వదిలించడానికి ఊళ్లో ఉన్న తండ్రితో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చేసే క్షుద్రపూజ కార్యక్రమం సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు. ఇంటర్నెట్ సరిగ్గా లేక ఆ పూజ మధ్యలో ఆగిపోయినప్పుడు వచ్చే సన్నివేశాలకు థియేటర్లో నవ్వుల వర్షం కురుస్తుంది. అయితే వినోదానికి ఇచ్చిన ప్రాధాన్యత కథా గమనానికి ఇవ్వకపోవడం కొంత లోపం. ఒకదాని వెంట ఒకటి నవ్వించే ఎపిసోడ్స్ వస్తుంటాయి కానీ, కథలో బలమైన ఫ్లో ఉండదు. ఇక క్లైమాక్స్ సన్నివేశాలు మరీ కార్టూన్ నెట్వర్క్ తరహాలో సాగడం కొంచెం నిరాశపరుస్తుంది. ఫస్టాఫ్ లో ఉన్న సాగతీతను తగ్గించి ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేది. లాజిక్స్ వెతక్కుండా కేవలం నవ్వుకోవడానికి వెళ్లే వారికి ఈ సినిమా వినోదాన్ని పంచుతుంది.

నటీనటులు:

పల్లెటూరి యువకుడిగా, విదేశీ గ్యాంగ్ స్టర్ గా రెండు భిన్నమైన పాత్రలలో వరుణ్ తేజ్ అద్భుతంగా నటించాడు. పల్లెటూరి యాసతో పాటు, విదేశీ స్టైలిష్ హావభావాలను చాలా చక్కగా పలికించాడు. తనలోని కొత్త నటుడిని ఈ సినిమాతో బయటకు తీశాడు. అయితే ఈ సినిమాకు ప్రధాన బలం, ప్రాణం అంతా హాస్యనటుడు సత్యనే. ఒకరకంగా చెప్పాలంటే ఆయనే ఈ కథను తన భుజాలపై వేసుకుని నడిపించాడు. తన మార్క్ టైమింగ్ తో, డైలాగ్ డెలివరీతో సినిమాని మరో మెట్టు ఎక్కించాడు. పూజారి పాత్రలో మురళీధర్ గౌడ్ పండించిన హాస్యం కూడా బాగా పేలింది. హీరోయిన్ గా రితిక నాయక్ తన పరిధి మేర నటించి ఆకట్టుకుంది. విలన్ గా సునీల్, అలాగే వీటీవీ గణేష్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

సంగీత దర్శకుడు థమన్ నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. పాటలు అంతగా గుర్తుంచుకునేలా లేకపోయినా, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను గుర్తుచేసేలా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కొన్ని చోట్ల ఓకే అనిపించాడు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. కొరియా అందాలను, పల్లెటూరి వాతావరణాన్ని కెమెరాలో అందంగా, కలర్ ఫుల్ గా బంధించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి, ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదు. సత్య ఎడిటింగ్ మొదటి సగంలో కాస్త కత్తెరకు పని చెప్పి ఉంటే సినిమా ఇంకా వేగంగా ఉండేది. దర్శకుడు మేర్లపాక గాంధీ ఎంచుకున్న పాయింట్ బాగున్నా, దాన్ని మొదటినుంచి చివరిదాకా ఒకే ఊపుతో తెరకెక్కిస్తే ఫలితం ఇంకా అద్భుతంగా ఉండేది. సెకండాఫ్ ప్లానింగ్ విషయంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యాడు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా కొరియన్ కనకరాజు.. లాజిక్స్ తో పనిలేకుండా కాసేపు హాయిగా

Follow Us