IND vs BAN: బంగ్లాపై పట్టుబిగించిన భారత్‌.. విజయానికి 4 వికెట్ల దూరంలో..

|

Dec 17, 2022 | 5:30 PM

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. అయితే ఆతిథ్య జట్టుకు టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫాలో ఆన్ ఇవ్వలేదు.

IND vs BAN: బంగ్లాపై పట్టుబిగించిన భారత్‌.. విజయానికి 4 వికెట్ల దూరంలో..
India Vs Bangladesh
Follow us on

మొదట బ్యాటర్లు, ఆతర్వాత బౌలర్ల సమష్ఠి ప్రదర్శనతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా విజయం అంచున నిలిచింది. ఛతోగ్రామ్‌ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో నాలుగో రోజు ఆటముగిసే సమయానికి బంగ్లా రెండో ఇన్నింగ్స్‌ లో ఆరు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. భారత జట్టు విజయానికి ఇంకా నాలుగు వికెట్ల దూరంలో ఉంది. అదే సమయంలో బంగ్లాదేశ్ ఇంకా 241 పరుగులు చేయాల్సి ఉంది. జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా ముందు భారత్ 513 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. అయితే ఆతిథ్య జట్టుకు టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫాలో ఆన్ ఇవ్వలేదు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ రెండు వికెట్ల నష్టానికి 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్‌కు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. లక్ష్య ఛేదనలో వికెట్ నష్టపోకుండా 42 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ కు ఓపెనింగ్ జోడీ శుభారంభం అందించింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో, జాకీర్ హసన్ తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించారు.

జకీర్‌ సూపర్‌ సెంచరీ..

అయితే ఈ జోడీ ఔటైన వెంటనే బంగ్లాదేశ్ బ్యాటింగ్ కుప్పకూలింది. అక్షర్ పటేల్, కుల్దీప్ తమ స్పిన్‌ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లను వెంటవెంటనే పెవిలియన్‌ కు పంపించారు. శాంటోను ఔట్ చేసిన ఉమేష్ యాదవ్ చేతుల మీదుగా భారత్‌కు తొలి వికెట్ లభించింది. శాంటో 156 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. యాసిర్ అలీని అక్షర్ ఔట్ చేశాడు. లిటన్ దాస్‌ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్‌కు పంపించాడు. యాసిర్ ఐదు, లిటన్ 19 పరుగులు చేశారు. దీని తర్వాత, అశ్విన్ మరో ఎండ్‌లో సెంచరీతో పాతుకుపోయిన హసన్‌ను అవుట్ చేశాడు. జకీర్‌ మొత్తం 224 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 100 పరుగులు చేశాడు. 23 పరుగుల వద్ద ముష్ఫికర్ రహీమ్ ఇన్నింగ్స్‌ను ముగించడం ద్వారా అక్షర్ బంగ్లాదేశ్‌కు ఐదో షాక్‌ ఇచ్చాడు. ఆ వెంటనే నూరుల్ హసన్‌కు పెవిలియన్ దారి చూపించాడు.

ఇవి కూడా చదవండి

 

స్పిన్నర్ల మాయాజాలంతో నాలుగో రోజే భారత జట్టు గెలుస్తుందని అనిపించింది. కానీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్ పోరాడి టీమిండియా విజయాన్నిఆలస్యం చేవారు. షకీబ్ 69 బంతుల్లో 40 పరుగులు చేసి ఆడుతున్నాడు. తన ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మిరాజ్ ఇప్పటివరకు 40 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో తొమ్మిది పరుగులు చేశాడు. భారత్ తరఫున అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..