
Jay Shah ICC World Cup Format Changes: ప్రపంచ క్రికెట్ అభిమానులకు అంతకు మించిన పండగ వార్త మరొకటి లేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సారథి జై షా నేతృత్వంలో ఒక చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నారు. వన్డే, టీ20 ప్రపంచకప్‌లతో పాటు టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫార్మాట్లలో విప్లవాత్మక మార్పులు చేయడం ద్వారా భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ల సంఖ్యను మరింత పెంచేందుకు ఐసీసీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.
క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోరుకు ఉండే క్రేజ్, భావోద్వేగాలు మరే మ్యాచ్‌కూ ఉండవు. రాజకీయ కారణాల వల్ల ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఈ దాయాదుల పోరును చూసే భాగ్యం అభిమానులకు కలుగుతోంది. ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే విపరీతమైన ఆదరణ, భారీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని, జై షా నేతృత్వంలోని ఐసీసీ సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బరోలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ మేరకు కీలక ప్రతిపాదనలపై చర్చలు జరిగాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, రాబోయే వన్డే ప్రపంచకప్‌లలో జట్ల సంఖ్యను 14 నుంచి 12కి తగ్గించాలని ఐసీసీ యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న రౌండ్-రాబిన్, సెమీఫైనల్ పద్ధతికి స్వస్తి పలికి, దాని స్థానంలో ‘సూపర్ సెవెన్’ (Super Seven) దశను ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ కొత్త విధానం వల్ల టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకటి కంటే ఎక్కువసార్లు తలపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల వేదికగా జరగబోయే వన్డే ప్రపంచకప్ నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు, పొట్టి ప్రపంచకప్ (T20 World Cup) ఫార్మాట్‌లోనూ భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. గతంలో ఉన్న ‘సూపర్ ఎయిట్’ స్థానంలో ఇకపై ‘సూపర్ టెన్’ (Super Ten) దశను తీసుకురావడానికి ఐసీసీ మొగ్గు చూపుతోంది. మొదటి రౌండ్ ముగిసిన తర్వాత టాప్ జట్లతో ఈ సూపర్ టెన్ రౌండ్ నిర్వహిస్తారు. దీని ప్రధాన ఉద్దేశం కూడా భారత్-పాక్ మ్యాచ్‌లను గరిష్టంగా పెంచడమే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే టీవీ రేటింగులు బద్దలైపోవడమే కాకుండా, స్పాన్సర్ల ద్వారా ఐసీసీకి కాసుల వర్షం కురుస్తుంది. అందుకే ఈ వ్యూహాత్మక మార్పులకు జై షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
టెస్ట్ క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఐసీసీ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం రెండు సంవత్సరాల సైకిల్ ముగిసిన తర్వాత టాప్-2 స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ఫైనల్లో తలపడుతున్నాయి. అయితే, ఇకపై ఫైనల్ కంటే ముందు సెమీఫైనల్స్ నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌లో తలపడతాయి, అందులో గెలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్‌లు జరగనందున, ఈ ఫార్మాట్‌లో దాయాదుల పోరు చూడటం కష్టమే. అలాగే, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో జట్ల సంఖ్యను 12కి పెంచాలనే ప్రతిపాదనను ఐసీసీ ప్రస్తుతానికి పక్కనబెట్టింది. మునుపటిలాగే 9 జట్లతోనే తదుపరి సైకిల్ కొనసాగనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..