Irfan Pathan: వాడి ఫేస్ తీసేసి.. నా ముఖం పెట్టారు.. పాకిస్థాన్ మీడియాపై ఇర్ఫాన్ పఠాన్ ఫైర్
Irfan Pathan: ఇర్ఫాన్ పఠాన్‌పై పాకిస్థాన్ మీడియా ప్రచారం చేసిన ఫేక్ వీడియో వివాదం కలకలం రేపింది. బాబర్ అజమ్ ఇంటర్వ్యూ వివాదంలో తన ముఖాన్ని ఏఐతో నకిలీ వీడియోలో ఉపయోగించారని పఠాన్ వెల్లడించాడు. అసలు వీడియోలో ఉన్నది బంగ్లాదేశ్ రిపోర్టర్ అని చెబుతూ, వైరల్ ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Irfan Pathan: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ ఇర్ఫాన్ పఠాన్ పాకిస్థాన్ మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. పాక్ మీడియా, సోషల్ మీడియా హ్యాండిల్స్ తనపై తప్పుడు కథనాన్ని ప్రచారం చేశాయని ఆయన వెల్లడించాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజమ్ తనకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించాడంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశాడు. రోజువారీ ట్రోలింగ్, ఫేక్ వీడియోల వెనుక ఉన్న అసలు నిజాన్ని ఆయన ఒక షోలో వివరించాడు.
ఈ వివాదం వెనుక ఉన్న అసలు నిజాన్ని ఇర్ఫాన్ పఠాన్ వివరిస్తూ.. “పాకిస్థాన్ మీడియాలో ఒక వీడియో వైరల్ చేశారు. నేను బాబర్ అజమ్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్తే, అతడు ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పినట్లు చూపించారు. ‘ఈ ఇర్ఫాన్ పఠాన్ మా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతాడు, అందుకే ఇంటర్వ్యూ ఇవ్వను’ అని బాబర్ అన్నాడని కథనాలు అల్లేశారు. కానీ అది పచ్చి అబద్ధం. ఫోటోషాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి వేరొకరి ముఖం స్థానంలో నా ముఖాన్ని అతికించి ఈ ఫేక్ డ్రామా ఆడారు” అని తెలిపాడు.
నిజానికి ఆ ఘటనలో బాబర్ అజమ్‌ను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించింది ఒక బంగ్లాదేశీ యువ రిపోర్టర్ అని ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశాడు. మొదటిసారి మైదానంలోకి వచ్చిన ఆ యువ రిపోర్టర్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి బాబర్ నిరాకరించాడని, ఆ రిపోర్టర్ ముఖాన్ని తొలగించి స్థానంలో తన ఫేస్‌ను AI ద్వారా జోడించారని వెల్లడించాడు. ఆ నకిలీ వీడియోకు లక్షల్లో వ్యూస్ రావడంతో చాలామంది అది నిజమేనని నమ్మారని పఠాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతీ చిన్న విషయానికి స్పందిస్తూ పోతే ప్రశాంతంగా జీవించలేమని ఆయన అభిప్రాయపడ్డాడు.
ఇర్ఫాన్ పఠాన్ భారత జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్‌ను అక్టోబర్ 2012లో ఆడాడు. ఆ తర్వాత జనవరి 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు అధికారికంగా వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ అనంతరం ఆయన వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్, లెజెండ్స్ లీగ్ క్రికెట్ వంటి లీగ్స్‌లో ఆడుతూ అలరిస్తున్నాడు. క్రికెట్ మైదానానికి దూరమైనప్పటికీ కామెంటర్, స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా విశేష ప్రజాదరణ పొందుతున్నాడు. అంతేకాకుండా యువ క్రికెటర్లను తీర్చిదిద్దడానికి స్వంతంగా క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్ను కూడా నడుపుతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
