అతను సెంచరీ చేయకుంటే.. నేను బట్టలు లేకుండా తిరుగుతా: ఆసీస్ మాజీ క్రికెటర్
మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హేడెన్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ ఆస్ట్రేలియాలో సెంచరీ చేయకపోతే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించాడు. రూట్ ఇప్పటికే 39 టెస్ట్ సెంచరీలు సాధించాడు, కానీ ఆస్ట్రేలియా లో ఇంకా సెంచరీ లేదు.

గతంలో టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే తాను రోడ్డుపై బట్టలు లేకుండా తిరుగుతానంటూ ఓ ఇండియన్ మోడల్ ప్రకటించిన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మ్యాథ్యూ హేడెన్ కూడా సేమ్ టూ సేమ్ అలాంటి సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అయితే ఓ టీమ్ వరల్డ్ కప్ గెలవాలని కాకుండా.. ఓ ఆటగాడు సెంచరీ చేయకుంటే తాను ఆ పని చేస్తానంటూ ప్రకటించాడు. ఇంతకీ పూర్తి స్టోరీ ఏంటంటే..?
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య యాషెస్ సిరీస్ వేడి మొదలైంది. నవంబర్‌లో యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌కు ముందు, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ఒక పెద్ద ప్రకటన చేశాడు. ఇంగ్లాండ్ డాషింగ్ బ్యాట్స్‌మన్ జో రూట్ సెంచరీ చేయకపోతే, తాను మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నగ్నంగా తిరుగుతానని మాథ్యూ హేడెన్ చెప్పాడు. జో రూట్ ఇప్పటివరకు 39 టెస్ట్ సెంచరీలు సాధించాడు. ఇటీవలె టీమిండియాతో ఆడిన ఐదు టెస్టుల సిరీస్‌లోనూ మంచి ఫామ్ కనబర్చాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో ఒక్క టెస్ట్ సెంచరీ కూడా చేయలేదు.
ఈ సారి ఆస్ట్రేలియాలో జో రూట్ కచ్చితంగా సెంచరీ చేస్తాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రూట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 2021 నుండి 61 టెస్టుల్లో 56 కంటే ఎక్కువ సగటుతో 5720 పరుగులు చేశాడు, ఇందులో 22 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు సాధించాడు. జో రూట్ ఆస్ట్రేలియాలో 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 35.68 సగటుతో 892 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో అతను 9 హాఫ్ సెంచరీలు సాధించగలిగాడు కానీ ఇంకా సెంచరీ చేయలేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




