AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Record : సౌతాఫ్రికా చేతిలో ఓడినా.. చరిత్ర పుటల్లో నిలిచిపోయే రికార్డును ఖాతాలో వేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్

World Record : మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో 200 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్రలో నిలిచింది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించి భారత మహిళల క్రికెట్‌కు మరో గర్వకారణంగా మారింది.

World Record : సౌతాఫ్రికా చేతిలో ఓడినా.. చరిత్ర పుటల్లో నిలిచిపోయే రికార్డును ఖాతాలో వేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్
Harmanpreet Kaur
Rakesh
|

Updated on: Jun 22, 2026 | 6:33 AM

Share

World Record : మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా మాంచెస్టర్‌లో సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెరీర్‌లో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఈ మ్యాచ్ ద్వారా ఆమె అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని ఒక అద్భుతమైన ప్రపంచ రికార్డును తన పేరిట రాసుకుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే 200 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ప్లేయర్‌గా హర్మన్ రికార్డు పుటల్లోకి ఎక్కింది.

పురుషుల క్రికెట్‌లో కూడా లేని అరుదైన రికార్డు

ఈ రికార్డులోని అసలు విశేషం ఏంటంటే.. ఇప్పటివరకు పురుషుల క్రికెట్‌లో సైతం ఏ ఒక్క ఆటగాడు కూడా 200 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల మార్కును తాకలేకపోయారు. మెన్స్ క్రికెట్‌లో అత్యధిక టీ20లు ఆడిన రికార్డు ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్ (163 మ్యాచ్‌లు) పేరిట ఉంది. ఇక భారతదేశం తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 159 మ్యాచ్‌లతో ఈ జాబితాలో ఓవరాల్‌గా రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ ఇప్పటికే టీ20ల నుంచి రిటైర్ అవ్వగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం ఏకంగా 200 మ్యాచ్‌లు ఆడి పురుష క్రికెటర్లకు కూడా అందనంత ఎత్తులో నిలిచింది.

టీమ్ మేట్స్ నుంచి స్పెషల్ గిఫ్ట్

ఈ చారిత్రాత్మక మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు భారత జట్టు ఘనంగా సత్కరించింది. జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, హెడ్ కోచ్ అమోల్ మజుందార్ కలిసి హర్మన్‌కు ప్రత్యేకంగా డిజైన్ చేసిన 200 నంబర్ గల ప్రత్యేక జెర్సీని బహూకరించారు. ఈ జెర్సీపై టీమిండియా ఆటగాళ్లందరి ఆటోగ్రాఫ్‌లు ఉన్నాయి. దీనితో పాటు ఆమెకు ఒక స్పెషల్ క్యాప్‌ను కూడా ప్రెజెంట్ చేశారు. ఈ సందర్భంగా మైదానంలో తోటి ఆటగాళ్లు హర్మన్‌ను అభినందనలతో ముంచెత్తారు.

హర్మన్‌ప్రీత్ కౌర్ కెరీర్ టీ20 రికార్డులు

2009లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. తన మొదటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ను జూన్ 2009లో ఇంగ్లాండ్‌తో ఆడింది. నాటి నుంచి నేటి వరకు కంటిన్యూగా రాణిస్తూ వస్తోంది. సౌతాఫ్రికాతో జరిగిన ఈ 200వ మైలురాయి మ్యాచ్‌లో ఆమె 22 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయింది. ఓవరాల్‌గా హర్మన్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఆడిన 200 టీ20 మ్యాచ్‌లలో 4,147 పరుగులు సాధించింది. ఇందులో ఒక సుడిగాలి సెంచరీతో పాటు 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ, హర్మన్ సాధించిన ఈ వరల్డ్ రికార్డ్ ప్రతి భారతీయ క్రికెట్ అభిమాని గర్వపడేలా చేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us