20 ఏళ్ల కెరీర్‌‌లో ఎన్నో ఎత్తుపల్లాలు.. అత్యధిక వికెట్లతో ప్రపంచ రికార్డ్.. అయినా, ఆ విషయంలో నిరాశే అంటోన్న టీమిండియా దిగ్గజం..

Jhulan Goswami: జులన్ గోస్వామి 2002లో భారతదేశం తరపున తన వన్డే, టెస్ట్ అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి ప్రతి ఫార్మాట్‌లో భారత నంబర్ వన్ బౌలర్‌గా నిలిచింది.

20 ఏళ్ల కెరీర్‌‌లో ఎన్నో ఎత్తుపల్లాలు.. అత్యధిక వికెట్లతో ప్రపంచ రికార్డ్.. అయినా, ఆ విషయంలో నిరాశే అంటోన్న టీమిండియా దిగ్గజం..
Jhulan Goswami
Follow us
Venkata Chari

|

Updated on: Sep 24, 2022 | 1:22 PM

Jhulan Goswami: భారత గ్రేటెస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి తన కెరీర్ చివర్లో టీమ్ ఇండియా నుంచి అద్భుత వీడ్కోలు అందుకుంది. ఇంగ్లండ్‌లో 23 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు ఝులన్‌కు అద్భుతమైన వీడ్కోలు బహుమతిని అందించింది. సెప్టెంబర్ 24 శనివారం, ఝులన్ తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఆడనుంది. ఎన్నో గొప్ప విజయాలు సాధించినప్పటికీ, ఝులన్ ఒక విషయంపై పశ్చాత్తాపపడుతుంది. తన హయాంలో ప్రపంచ కప్ గెలవకపోవడంపై మదనపడుతోంది. తన 20 ఏళ్ల కెరీర్‌లో టీమిండియా రెండుసార్లు ప్రపంచ కప్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. కానీ, గెలవలేకపోయింది.

లార్డ్స్‌లో శనివారం జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు సెప్టెంబర్ 23 శుక్రవారం నాడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వీడ్కోలుకు ముందు జరిగిన ఈ విలేకరుల సమావేశంలో, ఈ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ తన కెరీర్ విజయాల గురించి చెప్పుకొచ్చింది.

రెండు సార్లు టైటిల్ మిస్..

ఇవి కూడా చదవండి

శనివారం భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ జరగనుంది. దీంతో జులన్ కెరీర్ దాదాపు రెండు దశాబ్దాలు పూర్తవుతుంది. ఈ ప్రత్యేక మ్యాచ్‌కు ముందు మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా ఝులన్ భావోద్వేగానికి గురైంది. “నేను రెండు ప్రపంచకప్ ఫైనల్స్ (2005, 2017) ఆడాను. కానీ ట్రోఫీని గెలవలేకపోయాను. నాలుగేళ్లుగా ప్రపంచకప్‌కు సిద్ధమయ్యాం. నన్ను క్షమించండి. చాలా కష్టపడాలి. ప్రపంచకప్‌ గెలవడం ప్రతి క్రికెటర్‌కు ఓ కల లాంటింది. అది నిజమైతే, అంతకు మించి ఆనందం వేరే ఉండదు.” అని చెప్పుకొచ్చింది.

సుదీర్ఘ కెరీర్‌తో ఆనందంగానే ఉన్నా..

39 ఏళ్ల స్టార్ భారత పేసర్ ఇంత కాలం క్రికెట్ ఆడే అవకాశం లభించడం తన అదృష్టంగా భావించింది. ఝులన్ మాట్లాడుతూ, “నేను ఆటలోకి వచ్చినప్పుడు చాలా కాలం ఆడాలని అనుకోలేదు. ఇదొక గొప్ప అనుభవం. ఈ గేమ్ ఆడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజం చెప్పాలంటే, చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. చక్డా (పశ్చిమ బెంగాల్) వంటి చిన్న పట్టణం నుంచి వచ్చాను. అప్పుడు నాకు మహిళల క్రికెట్ గురించి ఏమీ తెలియదు.” అంటూ చెప్పుకొచ్చింది.

చిరస్మరణీయ అరంగేట్రం..

మహిళల క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును సొంతం చేసుకున్న భారత వెటరన్ బౌలర్, తొలిసారిగా భారత జట్టులో భాగం కావడం తనకు మరపురాని క్షణమంటూ గుర్తు చేసుకుంది. ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఝులన్ “భారత్‌కు ఆడే అవకాశం లభించింది. మొదటి ఓవర్ బౌలింగ్ చేయడం నా బెస్ట్ మెమరీ. ఎందుకంటే నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. ప్రాక్టీస్ చేయడానికి లోకల్ ట్రైన్‌లో రెండున్నర గంటలు ప్రయాణించాల్సి రావడంతో నా క్రికెట్ ప్రయాణం కష్టమైంది.” అంటూ గుర్తు చేసుకుంది.

అత్యధిక వికెట్లు తీసిన రికార్డ్..

1997 ప్రపంచ కప్ ఫైనల్‌లో ‘బాల్ గర్ల్’ ఝులన్.. తన కలను నెరవేర్చుకుంది. అత్యంత విజయవంతమైన, అత్యంత గౌరవనీయమైన మహిళా క్రికెటర్లలో ఒకరిగా తన కెరీర్‌లో ఎన్నో శిఖరాలను చేరుకుంది. 2002లో అరంగేట్రం చేసిన ఝులన్ భారత్ తరపున 12 టెస్టు మ్యాచ్‌ల్లో 44 వికెట్లు పడగొట్టగా, 203 వన్డేల్లో 253 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇది కాకుండా 68 టీ20 మ్యాచుల్లో 56 వికెట్లు కూడా ఆమె ఖాతాలో చేరాయి. అంతే కాదు వన్డేల్లో జులన్ 1228 పరుగులు కూడా చేసింది.