IPL 2025: గతేడాది ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు.. కట్ చేస్తే.. నేడు అత్యంత చెత్త ప్లేయర్!
నితీష్ రెడ్డి గతేడాది ఎమర్జింగ్ ప్లేయర్‌గా మెరిసినా, 2025లో తన ఆటతీరు తీవ్రంగా పడిపోయింది. బ్యాటింగ్‌లో కనీస స్థిరత్వం లేకపోవడంతో SRH అతన్ని క్రమంగా డౌన్‌గ్రేడ్ చేసింది. బౌలింగ్‌లో కూడా పూర్తి ఫిట్‌నెస్ లోపించడం వల్ల అతని ఆల్‌రౌండ్ సామర్థ్యం మసకబారింది. గతేడాది చెలరేగిన నితీష్, ఈసారి అభిమానుల అంచనాలను అందుకోలేక విఫలమయ్యాడు.

నితీష్ రెడ్డి… ఒక సంవత్సరం క్రితం వరకు అతను భారత క్రికెట్‌లో భవిష్యత్తు స్టార్‌గా పరిగణించబడ్డాడు. ఐపీఎల్ 2024లో అత్యుత్తమ యువ ప్రతిభగా ఎదిగి, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్న నితీష్, ఆ తర్వాత భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకొని T20Iల్లో అద్భుతంగా రాణించాడు. తన రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లోనే 74 పరుగులతో పాటు రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో టెస్ట్ సెంచరీ సాధించడం ద్వారా మరింత గుర్తింపు పొందిన అతని ఫామ్ చూసి, 2025 ఐపీఎల్‌లో SRH తరఫున అతను పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తాడని అందరూ ఊహించారు. ఫ్రాంచైజీ కూడా అతనిపై తమ భవిష్యత్తు ఆశలన్నీ పెట్టి రూ. 6 కోట్లకు అతన్ని రిటైన్ చేసింది.
2025 సీజన్‌ను SRH జట్టు భాగంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ప్రారంభించిన నితీష్ రెడ్డి, మొదటి మ్యాచ్‌లోనే 15 బంతుల్లో 30 పరుగులు చేసి గొప్ప శుభారంభం చేశాడు. అప్పటివరకు అతనిలోని బ్యాటింగ్ ఆత్మవిశ్వాసం, బౌలింగ్ సమతుల్యత జట్టుకు ఉపయోగపడుతుందని భావించారు. కానీ, ఆ తర్వాత ఊహించని విధంగా అతని ప్రదర్శన దిగజారడం మొదలైంది. వరుసగా తక్కువ స్కోర్లు, మళ్లి మళ్లీ వికెట్లు కోల్పోవడం, ఆటపై పట్టుదల లోపించడం వంటి కారణాల వల్ల అతని ఆట తీరుని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా SRH యాజమాన్యం అతనిని బ్యాటింగ్ ఆర్డర్‌లో క్రిందకు పంపించి, అనికేత్ వర్మకు అతని స్థానంలో ప్రాధాన్యత ఇచ్చింది.
బ్యాటింగ్‌లో అనిశ్చితి, స్ట్రైక్ రేట్ పడిపోవడం, స్వేచ్ఛగా ఆడే శైలి తగ్గిపోవడం… ఇవన్నీ నితీష్ ఆటపై ప్రభావం చూపించాయి. బౌలింగ్ పరంగా కూడా అతను పూర్తి ఫిట్‌నెస్‌లో లేకపోవడంతో SRH అతని ఆల్‌రౌండ్ నైపుణ్యాలను ఉపయోగించలేకపోయింది. IPL 2025లో అతను కేవలం 11 ఇన్నింగ్స్‌లలో 182 పరుగులు మాత్రమే చేసి, సగటు 22.75, స్ట్రైక్ రేట్ 118.95తో నిరుత్సాహపరిచే గణాంకాలు నమోదు చేశాడు. ఇది గత ఏడాది అతను చేసిన 303 పరుగులు (సగటు 33.66, స్ట్రైక్ రేట్ 142.92)తో పోలిస్తే స్పష్టమైన వెనుకడుగు.
ఈ విధంగా, గతేడాది భారత టీ20 జట్టులో నాలుగో స్థానానికి ప్రధాన ఆప్షన్‌గా ఉన్న నితీష్, ఇప్పుడు SRH జట్టులో కూడా స్థిరంగా ఆడలేని స్థితికి దిగజారాడు. ఇది కేవలం వ్యక్తిగతంగా కాదు, జట్టుకు కూడా ఆందోళనకర పరిణామం. అతను సస్పెన్షన్ తర్వాత తిరిగి బౌలింగ్ చేయడం ప్రారంభించాడన్నది మాత్రం భవిష్యత్తు దృష్ట్యా కొంత బలాన్నిస్తుంది, ముఖ్యంగా రాబోయే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుంటే. అయినా, SRH కోణంలో చూస్తే, ఇది తీవ్ర నిరాశ కలిగించిన సీజన్. 2024లో అత్యున్నత శిఖరాలను అందుకున్న నితీష్ రెడ్డి, 2025లో ఊహించని పతనాన్ని ఎదుర్కొన్నాడు. అతని నుంచి అందరూ చాలా ఎక్కువ ఆశించారు, కానీ ఆ అంచనాలను నెరవేర్చడంలో అతను విఫలయ్యాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..