
3 Cricketers Played for Both India and Pakistan Teams: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రికెటర్లు ఒక్కొక్కరు రెండు దేశాలకు క్రికెట్ ఆడారు. అయితే భారత్, పాకిస్తాన్ రెండింటి తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కొంతమంది క్రికెటర్లు కూడా ఉన్నారని మీకు తెలుసా. 1947 ఆగస్టు 14న పాకిస్థాన్‌కు స్వాతంత్య్రం వచ్చిన సంగతి తెలిసిందే. దేశ విభజన తర్వాత ముగ్గురు భారత క్రికెటర్లు పాకిస్థాన్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఆ తర్వాత అక్కడ కొత్త జట్టును ఏర్పాటు చేసి భారత జట్టుకు వ్యతిరేకంగా ఆడడం ప్రారంభించారు. ఈ ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అబ్దుల్ హఫీజ్ కర్దార్‌ను పాకిస్థాన్ క్రికెట్ జట్టు పితామహుడిగా పిలుస్తారు. అతను తన కెరీర్‌లో 26 టెస్ట్ మ్యాచ్‌లలో మొత్తం 927 పరుగులు చేశాడు. ఇందులో ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. దీంతోపాటు 21 వికెట్లు కూడా తీశాడు. విశేషమేమిటంటే అబ్దుల్ హఫీజ్ ఇందులో మూడు టెస్టు మ్యాచ్‌లు భారత జట్టు తరపున ఆడగా, 23 టెస్టు మ్యాచ్‌లు పాకిస్థాన్ తరపున ఆడాడు. 1952లో అబ్దుల్ హఫీజ్ కర్దార్‌కి పాకిస్థాన్ కెప్టెన్సీ అప్పగించారు. టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. అతని సారథ్యంలోనే లక్నోలో జరిగిన టెస్టులో పాకిస్థాన్ భారత్‌ను ఓడించింది. అతను 1972 నుంచి 1975 వరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్‌గా ఉన్నాడు. హఫీజ్ తరువాత పాకిస్తాన్ రాజకీయాల్లో కూడా తన మ్యాజిక్ చూపించాడు. అనంతరం స్విట్జర్లాండ్‌లో పాకిస్తాన్ రాయబారిగా పనిచేశాడు.
ఈ జాబితాలో అమీర్ ఎలాహి పేరు కూడా చేరింది. ఆయన గురించి చాలా తక్కువ మంది అభిమానులకు తెలుసు. అమీర్ ఎలాహి తన కెరీర్‌లో కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడాడు. అతను భారతదేశం తరపున ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. మిగిలిన ఐదు మ్యాచ్‌లలో పాకిస్తాన్ జట్టులో భాగమయ్యాడు. 6 టెస్టుల్లో 82 పరుగులు, 7 వికెట్లు తీశాడు. అతను 1947లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో భారత్ తరపున తన మొదటి మ్యాచ్ ఆడాడు. ఈ విభజన జరిగిన తరువాత అతను పాకిస్తాన్ వెళ్ళాడు.
క్రికెట్ బాగా తెలిసిన వారికి గుల్ మహ్మద్ పేరు ఖచ్చితంగా తెలుసు. తన కెరీర్‌లో 9 టెస్టులు ఆడిన గుల్ మహ్మద్ భారత్ తరపున ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. 1955లో పాకిస్థానీ పౌరసత్వం తీసుకున్న తర్వాత పాకిస్థాన్ తరపున మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. గుల్ మొహమ్మద్ 1921 అక్టోబర్ 15న లాహోర్‌లో జన్మించాడు. గుల్ మొహమ్మద్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్. ఎడమచేతి వాటం బౌలర్. దీనితో పాటు, అతను తన ఫీల్డింగ్‌కు కూడా పేరుగాంచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..