21 వేల పరుగులు, 419 వికెట్లు.. క్రికెట్‌లోనే కాదు రాజకీయాల్లోనూ ఈ దిగ్గజ క్రికెటర్ ఎంట్రీ ఇచ్చాడు..
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు టెడ్ డెక్స్‌టర్ (86) అనారోగ్యంతో కన్నుమూశారు. 1958-68 మధ్య ఇంగ్లీష్ జట్టు తరపున 62 టెస్టులు..
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు టెడ్ డెక్స్‌టర్ (86) అనారోగ్యంతో కన్నుమూశారు. 1958-68 మధ్య ఇంగ్లీష్ జట్టు తరపున 62 టెస్టులు ఆడిన డెక్స్‌టర్ 47.89 సగటుతో 4502 పరుగులు చేశారు. ఇందులో 27 అర్ధ శతకాలు, 9 సెంచరీలు ఉన్నాయి. అప్పట్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, మీడియం ఫాస్ట్ బౌలర్‌గా పేరుగాంచిన డెక్స్‌టర్ 30 మ్యాచ్‌లకు సారధ్యం వహించారు.
ఇక డెక్స్‌టర్ 1956 నుండి 1968 వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో డెక్స్‌టర్ దిగ్గజం అని చెప్పవచ్చు. సుమారు 21 వేల కంటే ఎక్కువ పరుగులు చేయడమే కాకుండా.. 419 వికెట్లు తీసి చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నాడు. 1965లో కాలికి గాయం కావడంతో డెక్స్‌టర్ కొంతకాలం క్రికెట్‌కు దూరమయ్యారు. ఆ తర్వాత 1968వ సంవత్సరం యాషెస్ సిరీస్‌తో తిరిగి వచ్చారు.
క్రికెట్‌లో మాత్రమే కాదు.. రాజకీయాల్లోనూ డెక్స్‌టర్ ఎంట్రీ ఇచ్చారు. 1964లో యూకే సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. కార్డిఫ్ సౌత్-ఈస్ట్ నుంచి అభ్యర్ధిగా నిలబడ్డారు. దీని కోసం డెక్స్‌టర్ దక్షిణాఫ్రికా టూర్ నుంచి వైదొలిగారు. అయితే అనూహ్యంగా డెక్స్‌టర్ ఎన్నికల్లో ఘోర ఓటమిపాలయ్యారు.
పాత్రికేయుడి నుండి నవలా రచయిత వరకు..
1968లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత డెక్స్‌టర్.. వివిధ ఉద్యోగాలు చేశారు. ఏకకాలంలో రెండు వేర్వేరు వార్తాపత్రికలకు జర్నలిస్ట్‌గా క్రికెట్ న్యూస్ రాశారు. అలాగే 1976లో, క్లిఫోర్డ్ మేకిన్స్‌తో కలిసి, టెస్ట్‌కిల్ అనే నవలను సైతం డెక్స్‌టర్ రాశారు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌లో మరణించిన ఆస్ట్రేలియన్ బౌలర్ చుట్టూ దీని కథ ఉంటుంది.
చెరగని రికార్డు..
1962-1963 యాషెస్ సిరీస్‌లో డెక్స్‌టర్ ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సిరీస్‌లో అతడు 481 పరుగులు చేశాడు, ఇది ఆస్ట్రేలియాలో ఇంగ్లీష్ కెప్టెన్ చేసిన అత్యధిక పరుగులు. అలాగే డెక్స్‌టర్ 1959-60 సిరీస్‌లో వెస్టిండీస్‌పై 526 పరుగులు చేశాడు.