Fact Check : ఇండోర్ స్టేడియంలో గంభీర్‌కు ఘోర అవమానం?వైరల్ వీడియో వెనుక అసలు నిజమిదే!
Fact Check : గౌతమ్ గంభీర్‌కు వ్యతిరేకంగా ఇండోర్ స్టేడియంలో నినాదాలు చేశారంటూ వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని తేలింది. పాత ఆడియోను కొత్త విజువల్స్‌కు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తప్పుదారి పట్టిస్తున్నారు. దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని ఫ్యాక్ట్ చెక్ నివేదికలు బయటపెట్టాయి.

Fact Check : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు వ్యతిరేకంగా స్టేడియంలో నినాదాలు వెల్లువెత్తాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ఓడిపోవడంతో గంభీర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారని, అందుకే గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారని ఒక వీడియో వైరల్ అవుతోంది. అయితే, దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని ఫ్యాక్ట్ చెక్ నివేదికలు బయటపెట్టాయి.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ఓటమి పాలవ్వడం భారత క్రికెట్ చరిత్రలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. మన సొంత గడ్డపై కివీస్ జట్టు వన్డే సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. ఈ చారిత్రక ఓటమి తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్‌పై, ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో ఇండోర్ స్టేడియంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రేక్షకులంతా గంభీర్‌ను ఉద్దేశించి గౌతమ్ గంభీర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారంటూ 19 సెకన్ల వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ కూడా ఏదో కోపంగా చూస్తున్నట్లు కనిపించడంతో నెటిజన్లు ఇది నిజమేనని నమ్మారు.
Reaction of Virat Kohli, Shubhman Gill, and other players when crowd started shouting "Gambhir Haaye Haaye" 😳 pic.twitter.com/9gH2jCdH8E
— Keh Ke Peheno (@coolfunnytshirt) January 20, 2026
అయితే ఈ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఇది ఎడిటెడ్ వీడియో అని తేల్చిచెప్పాయి. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఇండోర్ హోల్కర్ స్టేడియంలోనివే అయినప్పటికీ, అందులో వినిపిస్తున్న ఆడియో మాత్రం అక్కడిది కాదు. గత ఏడాది సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయినప్పుడు, గౌహతి స్టేడియంలో ఫ్యాన్స్ చేసిన నినాదాల ఆడియోను దీనికి అతికించారు. అప్పట్లో కోచ్ గంభీర్, సపోర్ట్ స్టాఫ్‌పై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేసిన పాత ఆడియోను తీసుకుని, ఇప్పుడు ఇండోర్ వీడియోకు జోడించి తప్పుదారి పట్టిస్తున్నారు.
🚨: Angry Fans chanted "Gautam Gambhir Hay Hay" in front of Gautam Gambhir after India’s embarrassing Test series loss at Guwahati stadium. pic.twitter.com/7gq4T1lq8j
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) November 26, 2025
వైరల్ వీడియోలో విరాట్ కోహ్లీ ఎక్స్‌ప్రెషన్స్ కూడా నినాదాలకు సంబంధించింది కాదు. మ్యాచ్ ఓడిపోయిన బాధలో లేదా గ్రౌండ్‌లో ఏదో ఇతర విషయం గురించి అతను మాట్లాడుతుండగా తీసిన విజువల్స్ అవి. నిజానికి ఇండోర్ మ్యాచ్‌లో గంభీర్‌కు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలు వినిపించలేదని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు, మీడియా ప్రతినిధులు స్పష్టం చేశారు. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం లేదా గంభీర్-కోహ్లీ మధ్య ఉన్న పాత గొడవలను గుర్తు చేస్తూ కొందరు ఆకతాయిలు ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపారు. కాబట్టి ఫ్యాన్స్ ఇటువంటి ఫేక్ వీడియోలను నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
