IPL 2025: ఇది పిచ్‌ కాదు.. రోడ్డు! మంచి బౌలర్లను కూడా నాశనం చేస్తున్నారు: మాజీ క్రికెటర్‌

|

Mar 28, 2025 | 10:54 AM

సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL 2025లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో, SRH బ్యాటింగ్ లైన్‌అప్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు. లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయగా, SRH బౌలర్లు పరుగులు ఇచ్చి నిరాశపరిచారు. మైఖేల్ వాన్, ఉప్పల్ పిచ్‌ను రోడ్డుతో పోల్చి, బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.

IPL 2025: ఇది పిచ్‌ కాదు.. రోడ్డు! మంచి బౌలర్లను కూడా నాశనం చేస్తున్నారు: మాజీ క్రికెటర్‌
Srh Vs Lsg
Follow us on

ఐపీఎల్‌ 2025లో భాగంగా గురువారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మన హోం టీమ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి ఉప్పల్‌ పిచ్‌లో భీకరమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌ అంచనాలను అందుకోలేకపోయింది. తొలి మ్యాచ్‌లో 286 పరుగుల భారీ స్కోర్ చేసిన సన్‌రైజర్స్‌.. నిన్నటి మ్యాచ్‌లో కేవలం 190 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లు చాలా అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్ల వీక్‌నెస్‌లను టార్గెట్‌ చేసుకుంటూ.. ఒక పక్కా ప్లాన్‌ ప్రకారం బరిలోకి దిగి బౌలింగ్‌ చేశారు.

అది మంచి ఫలితాన్ని ఇచ్చింది. తమ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లను భయపెడుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌ను వాళ్ల సొంత గ్రౌండ్‌లో ఓడించడమంటే.. లక్నో అద్భుతమే చేసిందని చెప్పాలి. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్‌ను లక్నో బౌలర్లు ఎలాగైతే కట్టడి చేశారో.. అలాగే మన బౌలర్లు లక్నోను కంట్రోల్‌ చేస్తారు అనుకుంటే.. పూర్తిగా తేలిపోయారు. టాప్‌ క్లాస్‌ బౌలర్లు మొహమ్మద్‌ షమీ, ఆడమ్‌ జంపా, ప్యాట్‌ కమిన్స్‌లు కూడా ఈ పిచ్‌పై భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైఖేల్‌ వాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉప్పల్‌ పిచ్‌ను రోడ్డుతో పోల్చాడు. ఇలాంటి రోడ్డుపై బౌలింగ్‌ చేస్తున్నప్పుడు బౌలర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నాడు.

ఒకరకంగా ఇలాంటి రోడ్డు పిచ్‌లతో షమీ, కమిన్స్‌ కాన్ఫిడెన్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ దెబ్బతీస్తుందని అన్నాడు. 190 పరుగుల టార్గెట్‌ను లక్నో కేవలం 16.1 ఓవర్లలోనే కొట్టేసిందంటే పిచ్‌ ఎంత దారుణంగా ఉందో, బౌలర్లకు ఎంత ప్రతికూలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నాడు. ఈ మ్యాచ్‌లో షమీ 3 ఓవర్లలు వేసి 37, కమిన్స్‌ 3 ఓవర్ల వేసి 29, జంపా 4 ఓవర్లలో 46, హర్షల్‌ పటేల్‌ 2 ఓవర్లలో 28 ఇలా జట్టులోని ప్రధాన బౌలర్లంతా 12కి పైగా ఎకానమిని నమోదు చేశారు. ఇది కచ్చితంగా బౌలర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతిస్తుందని వాన్‌ అభిప్రాయపడ్డాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..