T20 World Cup 2026 : వరల్డ్ కప్ వేటలో ఆఫ్ఘన్ టైగర్స్..రషీద్ ఖాన్ కెప్టెన్సీలో టీమ్ రెడీ
Afghanistan Cricket : 2026 టీ20 ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. రాశిద్ ఖాన్ కెప్టెన్ గా ఉండగా.. నవీన్ ఉల్ హక్, గుల్బదిన్ నైబ్ లు జట్టులోకి తిరిగి వచ్చారు. దీంతో పోటీ రసవత్తరంగా మారనుంది.

T20 World Cup 2026 : భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న 2026 టీ20 ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సారథ్యంలో ఈ జట్టు బరిలోకి దిగనుంది. గత ప్రపంచ కప్‌లో సెమీఫైనల్ వరకు వెళ్లి సంచలనం సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్, ఈసారి ఆసియా పరిస్థితుల్లో అంతకంటే మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉంది.
ఈ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు గుల్బదిన్ నైబ్, నవీన్-ఉల్-హక్ తిరిగి చోటు దక్కించుకోవడం విశేషం. భుజం గాయం నుంచి కోలుకున్న నవీన్ ఉల్ హక్ రాకతో పేస్ విభాగం బలోపేతం కాగా, బిగ్ మ్యాచ్ ప్లేయర్ అయిన గుల్బదిన్ మిడిల్ ఆర్డర్‌లో అదనపు బలాన్ని ఇవ్వనున్నాడు. అలాగే మిస్టరీ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ కూడా జట్టులోకి రావడంతో స్పిన్ విభాగం మరింత పటిష్టంగా మారింది. అయితే, యువ స్పిన్నర్ అల్లా గజన్ఫర్ ను ప్రధాన జట్టులో కాకుండా రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేయడం గమనార్హం.
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ సీఈఓ నసీబ్ ఖాన్ మాట్లాడుతూ.. “గత ప్రపంచ కప్ జ్ఞాపకాలు మాకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. ఈసారి ఆసియా పిచ్‌లపై టోర్నీ జరగనుండటం మాకు కలిసి వచ్చే అంశం” అని ఆశాభావం వ్యక్తం చేశారు. చీఫ్ సెలెక్టర్ అహ్మద్ షా సులేమాన్ ఖిల్ మాట్లాడుతూ.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ షాహిదుల్లా కమల్ జట్టులో ఉండటం వల్ల బ్యాటింగ్ ఆర్డర్‌లో మంచి సమతుల్యత ఉంటుందని తెలిపారు. ఈ టీ20 ప్రపంచ కప్ కంటే ముందే ఇదే జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్ కూడా ఆడనుంది.
2026 టీ20 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-డిలో ఉంది. ఇందులో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యూఏఈ, కెనడా జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 8న చెన్నై వేదికగా న్యూజిలాండ్‌తో ఆఫ్ఘనిస్తాన్ తన తొలి పోరును ప్రారంభించనుంది. భారత గడ్డపై స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌లు ఉండటంతో, రషీద్ ఖాన్ సేన ఈసారి టైటిల్ ఫేవరెట్‌లలో ఒకటిగా నిలవాలని భావిస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్ 15 మంది సభ్యుల జట్టు
రషీద్ ఖాన్ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్ (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మహ్మద్ ఇషాక్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, దర్విష్ రసూలీ, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హాక్ ఫారూకీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
